ఎదురు చూపులోనీ... హాయి
ఎదను తడిమెనోయి ||ఎదురు||
తొలిప్రొద్దుపొడుపు మొదలు
మలిసంజె విడుపు వరకూ
తలుపువారగా చారబడి
తలపులేరుకొను తీరుబడి ||ఎదురు||
తెలి మబ్బుల నీడలు తగిలి
కలవరపడు ఎండలలో
చిరుజల్లులు నడివేసవిలో
మురిపించే ముచ్చటలో ||ఎదురు||
అవి గువ్వల గుసగుసలేమో
అవి గాలుల తీపి ఊసులో
తెరలు తెరలుగా తాకిపోయెనే
పాలపుంతల పలుకరింపులో ||ఎదురు||
ముసినగవులు పాటలెవో
కుసుమించిన ఏకాంతంలో
బాసలు మోయుచు తెమ్మెరలేవో
కొసరి వీచెడి తరుణంలో ||ఎదురు||
No comments:
Post a Comment