Monday, June 30, 2014

రవీంద్రుని గీతాంజలి :- 45 ; నా ప్రయత్నం


వినలేదా వినలేదా
సడిచేయని కదలికలను
వినలేవా వినలేవా
ఆ పదములను

అదుగో అరుదెంచెను
అదుగదుగో అరుదెంచెను
అరుదెంచెను అరుదెంచెను ….అరుదెంచెనూ.... ||అదుగో||

ప్రతి క్షణము ప్రతి యుగము
ప్రతి రేయీ పవలూ
నా పాటల అనుభూతులు 
స్వరసంచారములూ

నినదించెను రవళించెను ||అదుగో||

ఆమని నెత్తావుల్లో
ఈ వనసీమల్లో
వానల్లో మెరుపుల్లో
హరివిల్లుల్లో

ప్రసవించెను ప్రవహించెను  ||అదుగో||

ఆ అడుగుల జాడలె ప్రతి
గ్రుచ్చే వేదనలో
ఆ అడుగుల జాడలె ప్రతి
విచ్చే వేడుకలో

అణగించెను అలరించెను ||అదుగో||

Sunday, June 29, 2014

చినుకు .. రాలెను


పూలను, కాదు క్రొంజివురు బుగ్గలపైనను, శాద్వలమ్ములన్,
బాలుని కాగితప్పడవ పై పయనించెద, చేరెదన్  మహా    
శైల నిపాతశీతనదసౌధము! ఊహలదేలి చిన్కు తా 
రాలెను వాస్తవమ్మునొక రక్కసి గుండె సిమెంటుబండపై!

Thursday, June 26, 2014

ఒక్క క్షణం ఆగిచూడు!


ఒక్క క్షణం ఆగిచూడు....నీ కాలెటు పోతోందో!

రాళ్ళకు వెరవక పరుగెడుతోందో..?
పువ్వుల నవ్వుల మసి చేస్తోదో..!
ప్రగతి పథమ్మున పయనిస్తోందో..?
పిపీలికాలను బలితీస్తోందో..!

ఒక్క క్షణం ఆగి చూడు.... నీ చెయ్యేంచేస్తోందో!

కమిలిన మనసుకు మందేస్తోందో..?
విషజ్వాలలకు నెయ్యేస్తోందో..!
శాంతిసుమాలను అందిస్తోందో..?
కొడవలి  పట్టుకు నరికేస్తోందో..!

ఒక్క క్షణం ఆగి చూడు.... నీనాలుక ఏమంటోందో!

మంచిని పెంచే మాటిస్తోందో..?
కత్తులుదూసే కథ చెబుతోందో..!
సమభావాలకు లోబడి వుందో..?
అదుపు లేక అది పరుగెడుతోందో..!

ఒక్క క్షణం ఆగి చూడు.... హృదయంలో ఏందాగుందో!

మద లోభాలను తుడిచేసిందో..?
'ఆవేశం ' గా మార్చేసిందో..!
సత్యం పూర్తిగ గుర్తించిందో..?
తన ఊహలనే నిజమంటోందో..!

Wednesday, June 25, 2014

రవీంద్రుని గీతాంజలి :-44 ; నా ప్రయత్నం


ఎదురు చూపులోనీ... హాయి
ఎదను తడిమెనోయి ||ఎదురు||

తొలిప్రొద్దుపొడుపు మొదలు
మలిసంజె విడుపు వరకూ
తలుపువారగా చారబడి
తలపులేరుకొను తీరుబడి  ||ఎదురు||

తెలి మబ్బుల నీడలు తగిలి
కలవరపడు ఎండలలో
చిరుజల్లులు నడివేసవిలో
మురిపించే ముచ్చటలో  ||ఎదురు||

అవి గువ్వల గుసగుసలేమో
అవి గాలుల తీపి ఊసులో
తెరలు తెరలుగా తాకిపోయెనే
పాలపుంతల పలుకరింపులో  ||ఎదురు||

ముసినగవులు పాటలెవో
కుసుమించిన ఏకాంతంలో
బాసలు మోయుచు తెమ్మెరలేవో
కొసరి వీచెడి తరుణంలో ||ఎదురు||

Sunday, June 22, 2014

ఎటు పోదునురా


ఎటు పోదునురా రామా! స్వయముగ    ||ఎటు||

ఎదుటన ఉన్నా వెదకెడి కనులతొ
ఎదలోనున్నా ఎరుగని తనువుతొ
                                                          ||ఎటు||
పిలిచెడి నా ప్రతి పలుకులయున్నా
పలవరించెడి అలవాటు పోదే...   ||2||

అలలసంత నా కలవరింతలను...|2|
జలధిశయన నీ జాడలు యుండగ
                                                          ||ఎటు||

ఏ దారి కదిలిన నీదరికేగా
పదముల కైనా అదురుపాటులే.. ||2||

కుదురేలేని నా కదలికలోనా..|2|
కుదురుగ నీవే కూర్చొనియుండగ
                                                          ||ఎటు||

Friday, June 20, 2014

రవీంద్రుని గీతాంజలి :- 22; నా ప్రయత్నం


అలతి అలతి పదముల నీ అడుగు జాడలు
తొలిమొయిలు నీడలో
సడిలేని రేయిలా... అలా...అలా... ఎలా... ||అలతి||

మేలుకొన్న పొద్దు కనుల మగత క్రమ్మెను
నీలినింగి నల్లని పరదాల దాగెను
విసరి కసరు గాలులరొద వినుదురెవ్వరో
నిను కనుదురవ్వరో... అలా...అలా... ఎలా... ||అలతి||

సద్దు లేక చెట్టు చేమ సర్దుకున్నది
అడ్డులేవొ ప్రతి హృదయం కట్టుకున్నది
ఒంటరివై సాగిపోవు ఓ ప్రియతమా
ఒక్కసారి నా గుడిసెను సేదదీరుమా
నను చేరదీయుమా... అలా...అలా... ఎలా... ||అలతి||

Tuesday, June 17, 2014

ఏమాయెనో


ఏమాయెనో నాకు ఏమాయెనో
ఏ మరీచిక తానె ఎదురాయెనో |ఏమాయెనో|

మతి మాలెనో మనసు
గతి మాలెనో నీదు
నుతి మరచెనో నాదు
చితి పరచెనో.. |మతి|
వెతలోనెయుంటి జ-
గతి లోనె యుంటి ఈ
స్థితి లోన బ్రతుక స-
మ్మతమౌనా..                  |ఏమాయెనో|


శరణంటిరా నిన్నే
కరుణాకరా నన్ను
తరియింపగా నీవె
దరి చేరరా.. |శర|
చిరకాల పాపమీ
చిరు మనవి తోడనె
హరియించి నీ కృప
కురిపించరా..                  |ఏమాయెనో|

Sunday, June 15, 2014

రవీంద్రుని గీతాంజలి :-74 ; నా ప్రయత్నం


విషాదగీతం ప్రదోష కాలం
పలికించేదెవరో ..నన్ను పిలిపించేదెవరో!  ||విషాద||

ఘడియలు నడచిన కాలపు నీడల
నిండిన గుండెల తడిపొడి జాడల ||2||
                                                   ||విషాద||

గాలి కసరులో  అలల విసురులో  ||2||
చెలెరేగే నది పలవరింతలో....  ||గాలి||
ఒంటరి దారిని .. ఒంటరి వాడిని .. ||2||
                                                || విషాద||

ఇది నా తుదయో.. ఇదియే మొదలో ||2||
ఎదురయ్యేదెవరెరుగుదురో... ||ఇది||
రేవున నావను వేణువు నూదుతు.. ||2||
                                                || విషాద||

Wednesday, June 11, 2014

కూర్చునె యుంటిని రా


కూర్చునె యుంటిని రా నీకై
వేచియె యుంటిని రా!.......రామా..               ||కూర్చునె||

తోచెడి త్రోవలు తొంబది ఉన్నా |2|
గాచెడి నీకై కాపుగాసి నే...                        ||కూర్చునె||


విశ్వములో ఎటు వెదకినగానీ
శాశ్వతమైనది సాధ్యము కాదే  |2|
నశ్వరమైనవే నా అనుభూతులు
ఈశ్వర సత్యము ఎరుగలేని నే...               ||కూర్చునె||

కుట్టవు చీమలు గువ్వలు ఎగరవు
చెట్టుల చేమల చిగురులు తొడగవు |2|
అట్టిది నీవే ఆనతి నీయక
పుట్టునా  మనిషి పుర్రెకు బుద్ధులు                     ||కూర్చునె||

పలుకులనైనా తలపులనైనా
ఇలలోనైనా నా కలలోనైనా  |2|
విలువెంత 'నా ' అను ఆలోచనల
అలుక చాలు నీ ఆటబొమ్మపై.....               ||కూర్చునె||

శిక్షల మోసే శక్తియులేదు
లక్ష్యము చేరే దక్షతలేదు  |2|
మోక్షము తెలియని మొద్దును నేనని
ప్రేక్షక పాత్రను ప్రేమతొనీమని..                  ||కూర్చునె||

Tuesday, June 10, 2014

తప్పొప్పులెందుకు ?


తప్పొప్పులెందుకు ? తగవులాటెందుకు?
చప్పున రాకుండ జాగేలనయ్యా?
కప్పిన మాయలు కదలరాకున్నాయి
విప్పి నీవే కను విప్పు నాకీవయ్యా            || తప్పొప్పు||

అటు ఇటు కదిలేటి అదుపులేని మనసు
ఎటు తిరిగి మారదు ఎదురుచూపేలను
రాటు దేలినదీ జగతి రంగులరాటను
దాటగ దీనిని దారి నాకేదయ్య                  || తప్పొప్పు||

తెగులు పట్టిన నాదు తెలివినేమందును
తగునని తగదని తనకేదో తెలుసని
అగుపించి దాగుచు అలజడి రేపుచు
ఎగురుచు యున్నా తానెరుగలేదయ్యా      || తప్పొప్పు||

ఉందను ఆత్మ లోనున్నదో లేదో
అందులోనేముందొ అంతు తెలియాకుంది
కుందనపూ బొమ్మై కూర్చునే యుండును
విందు చూచునొ ఏమో వారించబోదయ్యా   || తప్పొప్పు||

Monday, June 9, 2014

రవీంద్రుని గీతాంజలి :- 08 ; నా ప్రయత్నం


ఎన్నడైనా ఆడగలడో అమ్మ ఒడిలోని
నేలమ్మ ఒడిలోని

తనివితీరా పరివశించగ
తనువు చెమటల సుగంధించగ
                          ||ఎన్నడైనా||

జలతారు బంగారు చేలములు కట్టేను
విలువైన రతనాల నగలేవొ పెట్టేను
కట్టెనవి ఆ గొంతు పట్టెనవి చూడు
అడ్డెనవి తడబాటునద్దెనవి చూడు
                          ||ఎన్నడైనా||
నలుగునో చిరుగునో చేజారిపోవునో
అదురుతో బెదురుతో అలసిపోయేవాడు
తలుపులన్నీ మూసి ఏకాంత సౌధాన
కదలకుండా ఉన్న ఆ వెఱ్ఱి వాడు  
                          ||ఎన్నడైనా||
ఏ సుఖములిచ్చు నీ అపరంజి చెరసాల
చైతన్యమీ గాలి నీరు నింగీ నేల
కలసి సందడి జేయు ఈ బ్రతుకు జాతర
పిలుపు నడగించేటి బహుపరాక్కుల తోడ
                          ||ఎన్నడైనా||

Friday, June 6, 2014

ఏ దారి సరియైనదో?


ఏ దారి సరియైనదో? .. తెలిసి
ఆదారి నడువగ అవకాశమున్నదొ?                              ||ఏదారి||

సంసారమున్నది సన్యాసమున్నది
మోసమ్ము న్నాది మూర్ఖత్వమూ ఉంది
ఉసురుపోయిన పిదప యునికెక్కడుండునో...

కాసారమున కరగు కాకిరెట్టలతీరు
ముసుగు మాయంబౌను ముగిసేటి వేళలో..         ||ఏదారి||

చేత నుందో లేక రాతలోనున్నదో
చేతిలో ఉన్నట్లు రాతలో నున్నదో
నీ చేతితోనే రాత చెక్కబడుచున్నదో

కోతి - పిల్లుల మధ్య కుదురైనదేమిటో
ఈ తలపులన్నిటిని ఇచ్చేది ఎవ్వరో? ..               ||ఏదారి||

Thursday, June 5, 2014

రవీంద్రుని గీతాంజలి :-05 ; నా ప్రయత్నం


ఒక్క క్షణం... ఒక్క క్షణం
నీ ప్రక్కన ఒక్క క్షణం
ఒక్క క్షణం... ఒక్క క్షణం
నా దిక్కున ఒక్క క్షణం           || ఒక్క క్షణం ||
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము           || ఒక్క క్షణం ||

నీ మోమును చూడనిదే  శాంతి యేది ... విశ్రాంతి యేది
నా లంపటాల కడలికి గట్టు యేది .. తుట్టతుది యేది
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము           || ఒక్క క్షణం ||

వేసవి తొలి అలికిడులు
నిట్టూర్పులు గుసగుసలు
వికసించిన పూదోటలు
తూనీగల సయ్యాటలు

నను చేరిన ఈ సమయం నీకెదురుగ నిలబడి
సడి చేయని చైతన్యపు సందడిని..... నన్ను  పాడనీ.... బ్రతుకు పాటని
నన్ను పాడని... బ్రతుకు పాటని ... || 2||

Tuesday, June 3, 2014

వదులుకు పోరాదా మనసా


వదులుకు పోరాదా మనసా                              ||వదులుకు||
ముదములు బాధలు మూడునాళ్ళవే
పదపడి పట్టుకు బ్రతుకగనేల                                      ||వదులుకు|

ఎందుకుగలవీ ఎండమావులో ఎరుగలేకపోతి
విందువినోదపు విపరీతమ్ముల విర్రవీగుచుంటి
ద్వంద్వములన్నియు ధ్వంసము కాగా త్వరపడి నీవే      ||వదులుకు||

తాపత్రయముల తామసాదులను తగిలియుండనేల
చేపగాలమున చిక్కియున్ననిక సేమముండగలదా
ఆపదతెలిసీ అగ్గిని తాకుట అజ్ఞానమ్మిది                        ||వదులుకు||

Monday, June 2, 2014

అలవాటుగా...


విశ్వం.. నాకిరుకయ్యింది
నేను ..నాకు బరువయ్యింది
శూన్యంలో సైతం  ఎవో నిగూఢ శక్తులు
నన్ను కుదిపేస్తున్నాయ్
సుషుప్తిలో సైతం ఎవో నా ఉనికిని
కాపాడేస్తున్నాయ్!

అర్థంలేని దృశ్యాలు
అర్థానికి అందని అదృశ్యాలు
అలవాటైపోయి
చూపు చచ్చిపోయింది.
కాంతి లేని ఏకాంతంలో కప్పడిపోయి
అలవాటులేని చీకటిని
కలుపుకోవాలనుంది. కరిగిపోవాలనుంది.