Wednesday, May 19, 2010

ఈ జన్మకిది చాలు మనసా...!

ఈ జన్మకిది చాలు మనసా...! నీవిక
మాజీల లెక్కలో మరియాదగా జేరు    ||ఈ జన్మ||

మాయలోకములోన మత్తెక్కియుండినా      |2|
హాయిగా సడిలేక ఆదమరచిన ఘడియ ||ఈ జన్మ||

కామ క్రోధాదులే కదులుతూ యున్నను   |2|
ఏ మార్గమూలేక ఏడుపై అణిగేను      ||ఈ జన్మ||

మంచి బుద్ధులు లేవు మచ్చుకైనా గాని  |2|
కంచుమ్రోతలు కాస్త గణనీయమై తరిగె||ఈ జన్మ||

ఎరుగని దానికీ ఎదురు చూపులు ఉన్న     |2|
ఎరుగలేనని నీవు ఎరుకగల్గిన వేళ   ||ఈ జన్మ||

అన్ని కావాలని ఆరట పడితేను        |2|
ఉన్న నాలుక కూడ ఊడి పోవును గనుక  ||ఈ జన్మ||

తప్పొప్పులింకనూ తలబరువు కాలేదు    |2|
తప్పుకో కూసింత తంటాలు నీకేల     ||ఈ జన్మ||

తొలగకున్నా గాని దోషంబులేవియూ    |2|
పలుమారు జేసేటి బాధ తప్పును గాన ||ఈ జన్మ||

Monday, May 17, 2010

ఎరుక

చేతిలో ఉన్నది చిత్తానికే ఎరుక
రాతిలో ఉన్నది రామప్పకే ఎరుక       ||చేతి||

వానకురిసెడి వేళ వనమయూరికి ఎరుక
గున్నమామిడి పూత కోకిలమ్మకు ఎరుక
ఏనుగొచ్చెడి దారి ఎడమకాలీ క్రింద
పీనుగై పడి ఉన్న పేడ పురుగుకు ఎరుక
                                        ||చేతి||
ఆశతీరిన వాడి కత్యాశయే తెగులు
ఆశ తీరని వాని కావేశమే మిగులు
కాష్ఠంలొ కాలేటి కట్టె ఏమెరుగునో
కాశిలో ఉన్నట్టి కాలభైరవుకెరుక
                                        ||చేతి||
కొమ్మమీద యున్న కోతి గెంతుట ముద్దు
రెమ్మమీది పిట్ట లెగిరిపోవుట కద్దు
బొమ్మ జెముడు లోని భూతమేంజేయునో
తమ్మిచూలిని గన్న తల్లిగారికి ఎరుక
                                        ||చేతి||
నచ్చిన నా మాట నవనీతముల కుండ
మెచ్చలేవు నీకు మెదడు కాలిన యుండ
పిచ్చి పాటలలోని పెంట ఎంతున్నదో
లచ్చి మగడౌ సూక రాల రాజునకెరుక
                                        ||చేతి||

Sunday, May 2, 2010

సూరీడు కథ

( ఈ కథ సంపుటి పక్ష పత్రిక లో వచ్చింది. (తే.దీ : 31-03-10 ; 14-04-10) )


తెలతెలవారుతోంది... ఆకుల చాటుగా, గగనం చేస్తున్న లేలేత కిరణాల అలికిడికి చిగురాకుల మత్తు కరిగి బిందువులుగా రాలుతున్నాయి. ఆ చిరుతుంపలు శరీరాన్ని గిలిగింతలు పెడుతుంటే నిద్రలేచాడు సూరీడు. ఒక్కసారి వళ్ళువిరుచుకుని చుట్టూ చూశాడు. తానున్న కొండ చరియపై నుండి చూస్తే ఆ క్రింద ఉన్న పచ్చని లోయ మబ్బుతెరల చాటున దోబూచులాడుతోంది అనిపించింది. పక్షుల కిలకిలలు అతని మనసులో తరంగిస్తున్నాయి. అరవిచ్చుకుంటున్న పూల వాసన అతని గుండెలనిండా వ్యాపించింది. గగనంలో సూర్యుడు, కొండపైని సూరీడూ.. ఇద్దరూ కదిలారు. దినచర్య ప్రారంభం అయ్యింది.
సూరీడికి పదహారేళ్ళు. ప్రపంచాన్ని తెలుసుకోవడమే కాక తర్కంతో తలకెక్కించుకునే తొలి రోజులు. అందులో ఒక రోజు తాత దగ్గరకు చేరాడు. ఆ తాత ఎక్కడివాడో తెలియదు. అక్కడ ఉన్నాడు. అంతే. అతనికి తెలియనివి లేవని అంతా అంటారు. సూరీడికి అది నమ్మిక. తాత లోయలోకి చూస్తున్నాడు. కనుచూపుమేరంతా పచ్చగా ఉంది. తాత దగ్గరనుండి వినీవినిపించకుండా నిట్టూర్పు! `ఏమైంది ? ' అడిగాడు సూరీడు. `ఈ పచ్చదనం బాగుందికదూ?' అడిగాడు తాత. లోయవైపు చూశాడు. బాగున్నట్టనిపించి `ఊ! ' కొట్టాడు సూరీడు. `నీకిది చాలా ఇష్టం కదూ! ' అది ప్రశ్నో కాదో తెలియదు. కానీ అది సూరీడు మనసులో అంతవరకూలేని ప్రశ్నను రేపింది. తనకిది ఇష్టమా? సూరీడు మనసులో ప్రశ్న ఉదయించింది. అవును! అది నిజం! ఇది తనకి చాలా ఇష్టమైనది! సమాధానం కూడా అప్పుడే ఉదయించింది! ప్రశ్నే సమాధానానికి ఆధారం. ప్రశ్న తోనే సత్యం ఆవిష్కరింపబడుతుంది. ప్రశ్నలు ఆగిపోయిననాడు నిజం తన ఉనికిని కోల్పోతుంది. మళ్ళీ `ఊ’ కొట్టాడు సూరీడు. తాత మాట్లాడలేదు. సూరీడికి కొంచం అర్థమయ్యింది. ఈ లోయలో పచ్చదనానికి ఏదో అయిపోతుంది. తనకిష్టమైన లోయ... బాధతో అతని మనసు మూలిగింది.
సూరీడు రోజూ లోయవంక చూస్తాడు. అంతా బాగుందని నిర్థారించుకుంటాడు. రోజులుగడుస్తున్నాయి. పచ్చదనం తగ్గుతోందేమో తగ్గిపోతోందేమో అన్న దిగులు పెరుగుతోంది. రేపో ఎప్పుడో ఏదో జరుగుతుంది! సూరీడుకి తెలుస్తోంది. అనుకున్నట్లుగా, అతని మనసు చెప్పినట్లుగా, ఒకనాడు అతనికి ఎక్కడో చిన్న తేడా కనిపించింది. దూరంగా ఒక చిన్న మచ్చ! కాస్త పచ్చదనం తగ్గినట్లుంది. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ మచ్చ పెద్దదౌతోంది. తాతనడిగాడు ఏమిటా మచ్చ అని? తాత ఆలోచించాడు... సూరీడిని చూసి `ప్రకృతి కి ఏర్పడిన మచ్చ .. మనిషి!'' అన్నాడు. సూరీడుకి చాలా ఆత్రంగా ఉంది. తాతను వదలేదు. `అక్కడ ఒక భవ్య హర్మ్య నిర్మాణం జరుగుతుంది. ఆ రాజుగారు తన కుమారుడు పెరిగాక చేసే వన విహారానికి అనువుగా అక్కడ నిర్మిస్తున్నారు.' తాత సూరీడు కేసి తదేకంగా చూస్తూ చెప్పాడు. సూరీడుకి ఇది నచ్చలేదు. `వనవిహారానికి అక్కడ ప్రకృతిని పాడు చెయ్యాలా? ఇక్కడ నుండి ఒక పెద్ద మచ్చలా కనిపిస్తోందంటే ... ఎంత పెద్ద ప్రదేశమో! అక్కడ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు ...? అసలు ఇంత దారుణం చెయ్యాలని ఎలా అనిపిస్తుంది. 'సూరీడుకి కోపం పెరిగిపోయింది. దీనిని ఆపాలి. ఎలాగైనా ఆపాలి. తతదగ్గరకు వెళ్ళాడు. `తాతా నేను వెళ్తా! రాజుగారిని ఇది ఆపమని చెప్తా! లోయలో పచ్చదనం పోకూడదు!" నిశ్చయంతో అన్నాడు. తాత చూశాడు. చిన్న నిట్టూర్పు వినపడీ వినపడకుండా వచ్చింది. సూరీడుకి అది వినపడలేదు. అతను బయలుదేరాడు.
అలా ప్రయాణిస్తూనే ఉన్నాడు. దూరంనుంచి అందంగా కనిపిస్తున్న లోయ, పచ్చదనంతో నిండి ఉన్న లోయ, నడకకి అంత సౌకర్యంగాలేదు కానీ తదేక దీక్షతో వెళ్తున్న సూరీడుకి ఇది తెలియటంలేదు. తెలిసే సమయానికి అతడు చాలా దూరం వచ్చేశాడు. రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి. అడవి పల్చబడుతోంది. చెట్టేక్కి చూశాడు. దూరంగా ఆకాశాన్ని తాకడానికి ఉరకలేస్తున్న కట్టడం. ప్రేలడానికి సిద్దమౌతున్న అగ్నిపర్వతంలా కనిపించింది సూరీడికి. వచ్చిన దారివైపు చూశాడు. ఆశ్చర్యం తను వచ్చిన కొండకూడా ఇప్పుడు అంతే ఎత్తులా కనిపిస్తోంది. ఆశ్చర్యపోయాడు. అతని మదిలో చిన్న అలజడి. నడకసాగింఛాడు.
ఆ భవనం వైపుగా ఒక కాలిబాట తగిలింది. ఆ దారిపట్టాడు. దారి వెడల్పయ్యింది. అక్కడక్కడ నరకబడిన చెట్టు మొదళ్ళు కనిపిస్తున్నాయి. అతని మనసు బాధగా మూలిగింది. ఎదురుగా ... చలువరాతితో చేసిన రహదారి. అతని కాలు ఆ పాలరాయి పై వేశాడు. ఆ స్పర్శ అతనికి ఎంతో సుఖంగా అనిపించింది. వసంతంలో ఉదయాన్నే చెట్లక్రింద పరచి ఉన్న పూలపై నడుస్తూ ఉంటే కలిగే అనుభూతి గుర్తుకు వచ్చింది. నడుస్తున్నాడు. హాయిగా అనిపించింది సూరీడుకి. అంతవరకూ అడవిలో రాళ్ళల్లో ముళ్ళల్లో నడిచిన అతనిపాదాలకు ఈ స్పర్శ నచ్చింది. దారి సాగుతోంది. ఎంతో మంది యాత్రికులు వస్తున్నారు వెళ్తున్నారు. వారిలో ఒకడిగా సాగిపోతున్నాడు. తన కొండగురించీ, లోయగురించి చెబుతున్నాడు. కొందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. కొందరు మాకు తెలుసులే అని వెళ్ళిపోతున్నారు. కొందరు అడవిమనిషి అని గేలి చేస్తున్నారు. కొందరు సానుభూతి చూబిస్తున్నారు. అయితే అందరూ తప్పించుకుంటున్నారు. సూరీడు నుంచి... లోయనుంచి .. కొండనుంచి... తమనుంచి ! సూరీడు నడుస్తున్నాడు. ఎదురుగా నిర్మితమవుతున్న సౌధం! అనేక మంది జనాలతో కోలాహలంగా ఉంది. అక్కడ ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాడు సూరీడు. అతనొక సందర్శకుడు, యాత్రికుడు.
సూరీడుకి ఆకలి వేసింది. అడవిలో వెతుకులాటలేదు. ఇక్కడ చూశాడు. ఒక ప్రక్క జనాలు ఒక వరుసలో సాగుతున్నారు. చేతిలో గిన్నెలు. ఆ ముందు ఏవో పదార్థాలు వేస్తున్నారు. అవి తింటున్నారు. సూరీడు కూడా వరుసలో నిలుచున్నాడు. చిత్రం ఆ ఎదురుచూపు ఆకలిని రెండింతలు చేసింది. తన వంతు వచ్చింది. అతడు సూరీడుని చూశాడు. పొమ్మన్నాడు. అది పనివాళ్ళకు మాత్రమే! బిచ్చగాళ్ళకుకాదు. సూరీడులో పౌరుషం పొడుచుకొచ్చింది. నిస్సహాయత లోనికి నెట్టేసింది. ఓ ప్రక్క చతికిలబడ్డాడు. ఆకలి, కోపం ... ఇవే భావాలు. ఒకడు వచ్చాడు. పని చేస్తావా అని అడిగాడు. చీకటి లో చిన్న వెలుగులా అనిపించింది సూరీడుకు. అతడు తిండి పెట్టాడు. పనిలో పెట్టాడు. మానవుల మధ్యలో పెట్టాడు. శిలల మధ్యలో పెట్టాడు. రాళ్ళు మోసుకుపోతున్నాడు సూరీడు. ఆ రాత్రి సూరీడు నిద్రపోయాడు. మొదటిసారిగా .. మగతగా... మత్తుగా. ఆ మరునాడు రాజుగారి దగ్గరకు వెళ్దామని బయలుదేరాడు.
దారిలో, తనకు పని ఇచ్చినవాడు కలిశాడు. మత్తులో తూలుతున్నాడు. పడిపోతున్నాడు. అతని పట్టుకున్నాడు. వివరాలు తెలుసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అనేక పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి కదిలింది సూరీడు వద్దకు వచ్చింది. తండ్రిని తీసుకు లోనికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. సూరీడు కనులు పాలరాతి విగ్రహాలనే చూస్తున్నాయి. అన్నిట్లోనూ ఒకే రూపం. శిల్పి వెనుక తిరుగుతున్నాడు. కొన్నాళ్ళకి తెలిసింది పాలరాతి బొమ్మకి మనసుకూడా రాతిదే అని. ఎన్నిలోయలు, ఎన్ని కొండలు చెరిగిపోయాయి, విరిగిపోయాయి. ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యాయి. ఎడారులు పొంగి పొరలాయి. ఒక లోయ, ఒక కొండ, కాస్త పచ్చదనం, ఎక్కడో మూలన దాగిపోయాయి. అతడు పని చేస్తున్నాడు. కసి తో చేస్తున్నాడు. రెట్టింపు పని చేస్తున్నాడు. నలుగురి పని చేస్తున్నాడు. రొట్టెలు కాదు నాణాలు తీసుకుంటున్నాడు. ఖర్చు చేస్తున్నాడు.
ఒకనాడు సివంగి పిలిచింది. సింహంలా దూకాడు. అతడు గెలిచాడు. సాధించాడు. అహంకరించాడు. ఆమె గెలిచింది. సాధించింది. ఆనందించిండి. సూరీడుకి సివంగి గూడు అలవాటయ్యింది. గూడు ఇరుకైంది. చెట్ల మధ్య రెండు రాతిపలకలు అంతే.
సూరీడు ఇంటికొచ్చాడు. అక్కడ రెండు చెట్లులేవు. సివంగి ఇల్లు కట్టింది. రాళ్ళాతో. తనకోసం! అతడికి నరికిన చెట్లు కనబడలేదు. రాతి ఇల్లు కనిపించింది. తన సివంగి కట్టిన ప్రేమ మందిరం. అంతదాకా ఆరుబయట పడుకునే సూరీడు సివంగి గూటికి చేరాడు. సివంగి కోసం ఏదైనా చెయ్యాలి. నాణాలు దాచుకోవటం మొదలెట్టాడు. అతడు ఎదుగుతున్నాడు. శరీరంకూడా. నలుగురి చేత పని చేయించే స్థాయికి వెళ్ళాడు. ధనం పెరిగింది. బొజ్జ పెరిగింది. కుటుంబం పెరిగింది. అతడు ఎదుగుతున్నాడు.
అప్పుడప్పుడు కొండ గుర్తుకు వచ్చేది... లోయ గుర్తుకువచ్చేది. మొదట్లో సిగ్గుపడ్డాడు. ఆపై భయపడ్డాడు. సర్ది చెప్పుకున్నాడు. సమర్ధించుకున్నాడు. ఆపై చిరాకును స్థిరపరిచాడు.
ఒకనాడు, మొదటిసారిగా తెలిసి తప్పు చేశాడు. జీర్ణించుకోలేకపోయాడు. ఆరాత్రి చిత్తుగా తాగాడు. అది మనసుని దహించేస్తోంది. తాత గుర్తుకువచ్చాడు. ఆగలేకపోయాడు. తిట్టుకున్నాడు....తాతని! అక్కసంతా వెళ్ళాగక్కాడు. అన్నీ తెలిసి తనను వెళ్ళకుండా వారించనందుకు. తప్పెవరిదో తెలిసింది. అతను స్థిమితపడ్డాడు. ఆ నాటి నుండీ అతను తప్పులు చెయ్యలేదు! తను చేసేవి తప్పులని అతను భావించలేదు మరి!
నాణాలు ఇచ్చే అధికారికి సహాయకుడయ్యాడు. చెట్లు నరికించి సివంగికి పెద్ద ఇల్లు కట్టాడు. రెండు మూడు చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి అతనికి. రాజుగారిని కలిసాడు. అతడు మాట్లాడాడు. భవనం గురించి దాని గొప్పతనం గురించి. రాజుగారి కళాదృష్టి గురించి. రాజు మెచ్చాడు! ఇప్పుడు అతనొక ప్రత్యేక అధికారి! అందరి లోపాలను ఎంచి అదిలించడం, రాజుగారికి వార్తలు చేరవేయటం అతనికతను నిర్ణయించుకున్న పని. అక్కడ ఉన్న రెండురాతిపలకల గూళ్ళన్నీ ఇప్పుడు సూరీడువే!
భవన నిర్మాణం పూర్తికావస్తోంది. రాజుగారి కుమారుడు పెద్దయ్యాడు. వచ్చాడు భవనం చూశాడు. ఆకాశాన్ని అంటేటట్టు సువిశాలమైన ప్రదేశంలో పాలరాతి శిల్పాలతో చిత్రవిచిత్ర కల్పనలతో నిర్మితమైన ఆ భవనం... అతనికి నచ్చలేదు. అలిగాడు. రాజుగారికి ఏం చెయ్యాలో అర్థంకాలేదు. సూరీడు రాకుమారుడికి చెప్పాడు .లోయగురించి అటుప్రక్క ఉన్న కొండగురించి. అక్కడ నుంచి లోయలోకి చూస్తే కలిగే ఆనందం గురించి …ఒకప్పుడు… రహస్యంగా! ఎందుకు చెప్పాడన్నది తెలుసుకోగలిగే స్థాయి దాటి అతని మెదడు సంక్లిష్టమైంది. అది విన్నాడు కనుక రాకుమారుడికి ఇది నచ్చలేదు.
రాజు మందలించాడు. రాకుమారుడు వినలేదు. తనకి కొండమీద వేరొక భవనం నిర్మించమన్నాడు. రాజు అహం దెబ్బతింది. మాటా మాటా పెరిగింది. రాజకీయం మొదలైంది. ముప్పావు వంతు నాశనం అయ్యిన ప్రకృతి ఆ ఆటలో ఒక పావు గా మిగిలింది. రాకుమారుడు స్వతంత్రించాడు. సూరీడు రాకుమారుడి పక్షం వహించాడు. అటువంటి ఉత్కంఠ సమయంలో .....
చంద్రం తాతదగ్గరకు వచ్చాడు. తాత చూశాడు. `ఈ కొండ బాగుందికదూ' అడిగాడు. మాట్లాడలేదు చంద్రం. `నీకు ఈ కొండంటే ఇష్టం కదూ!' చంద్రం మాట్లాడలేదు. అతడికిదేం పట్టలేదు. అతడు తాతనే చూస్తున్నాడు. ప్రశ్న ఉదయించకుండానే ఆగిపోయింది. అతనిలో పరిశీలన పుట్టలేదు. శోధన రూపుకట్టలేదు. సమాధానం ఉందోలేదో, ఉండేదో లేదో... ప్రశ్న ఉంటేకదా!

`ఇంక ఈ సూరీడు కథకు అస్థిత్వం లేదు కదూ!'.