Friday, May 30, 2014

రవీంద్రుని గీతాంజలి :-04 ; నా ప్రయత్నం


క్షణం క్షణం
యుగం యుగం
అదే వ్రతం అనారతం || క్షణం||

నీ జీవస్పర్శ పులకితం
కదా కణం కళేబరం
అకశ్మలం అకల్మశం
చేయగానకుంఠితం  || క్షణం||

లోలోన నీవు సత్య
జ్ఞానజ్యోతివై జ్వలించగా
నసత్యముల్ దహింపగా
నయుక్తముల్ నశింపగా  || క్షణం||

హృదాంతరాళవాసి నిన్
సదానురాగమాలలన్
కైసేయగా ప్రయత్నముల్
సుదుర్గుణాల్ శమింపగా  || క్షణం||

ప్రతీ పనీ ప్రయత్నమూ
నీ ప్రేరితం కదా ప్రభో
నీ సంతకం నిరంతరం
నా చేతలన్ స్ఫురింపగా  || క్షణం||

Thursday, May 29, 2014

తప్పులు చేయుదునేమో రామా


తప్పులు చేయుదునేమో రామా

చప్పున రమ్మీ ఇటురమ్మీ || తప్పులు ||


ఎప్పటికప్పుడు ఎగురుచునేవో
తిప్పలు తెచ్చెడి తింగరి మనసిది || తప్పులు ||

కచ్చిని రేపుచు కత్తులు బల్లాల్
గుచ్చిన రీతిని కోరికలు
వచ్చునొ, పట్టునొ, ప్రాణము మీదికి
తెచ్చునొ యేమో తింగరి మనసిది || తప్పులు||

ఉక్కిరి బిక్కిరి ఉచ్చులు, కప్పల
తక్కెడ మేళపు తర్కములు
చక్కని మార్గము సాధన సేయగ
దిక్కేదయ్యో తింగరి మనసిది || తప్పులు ||

ఇట్టే స్వర్గము ఇలలో చూపును
ఉట్టిని చేరని ఊహలతో
కట్టి పడేసిన కలలమేడ లం -
దిట్టుల యున్నది తింగరి మనసిది || తప్పులు||

Tuesday, May 27, 2014

రవీంద్రుని గీతాంజలి :- 40 ; నా ప్రయత్నం


సడిలేని వేడిదాడి
నా ఎడదలో ఎడారి
మరలించరా.. తొలగించరా
వడగాలిని జ్వాలని జాలిని పూని ||సడి||

క్రూరనిరంకుశ నిశ్చల గ్రీష్మం
వ్యగ్రమహోగ్ర దవానల భస్మం
మరలించరా.. తొలగించరా..
వడగాలిని జ్వాలని జాలిని పూని  ||సడి||

దినములుడిగిపోయే చిరు చినుకు జాడ  కఱవే
దివము వలువ లిగిరె కనుచూపుమేర కఱవే
దయచేసి ఆర్పు నిట్టూర్పుగాడ్పు||2||
ఈ ఎండను మండెను గుండియ బీడు ||సడి|| 

పగను పూనినావో పెను ఉప్పెనవ్వరాదో
కాలమేఘముల కాలపాశముల ముట్టడించరాదో
ఝళిపించరాదొ కొరడాలమెరుపు||2||
నలుదిక్కుల చెక్కిలి చిక్కగ కారగ ||సడి||

నిప్పులు చెరిగే నాన్న కోపమును
తప్పించెడి తడికొంగు నీడవై....
కరుణించరా.. శరణంటిరా
జలదమ్ముగ అమ్మగ నమ్మితి నయ్యా ||సడి||

Monday, May 26, 2014

గూడు విడచి పోరాదా గూటిలో చిలకా


గూడు విడచి పోరాదా గూటిలో చిలకా
పాడులోకమింతేలే మబ్బులేని తునకా

ఆకురాలు కాలమిది
వేటగాని జాలమిది    ||2||
మాటువేసి ఉన్నాది మాయదారి కనికట్టు
పిల్లగాలి తోడిచ్చి
పుల్లలేరుకోనిచ్చి  ||2||
చిచ్చుపెట్టె నీ చుట్టూ చితిపేర్చినట్టు
మాయదారి కనికట్టుచితిపేర్చినట్టు ||2||      || గూడు||

మొయిలు దారి పుట్టావు
గాలి దారి పట్టావు  ||2||
ఈ ఉరుకూ ఈ పరుగూ ఏదమ్మా నీ దరి
గోదారిలో మునకో
మట్టిగలిసే వరకో   ||2||
ఆగలేని నీ బ్రతుకు అయినాది ఆవిరి
ఏదమ్మా నీ దరి అయినాది ఆవిరి  ||2||     || గూడు||

Sunday, May 25, 2014

ఏరీతి నేర్పింతువో .. కృష్ణా!


పరమాత్మ నామము ధ్యానము నీమము
ఏరీతి నేర్పింతువో .. కృష్ణా..                       ||ఏరీతి||
సర్వ శాస్త్ర సంచారుని సారును
ఏరూపు వీక్షింతునో ... కృష్ణా...                   ||ఏరీతి||

కాసార సంసార నిస్సార జీవనం
మోసాల దోషాల పాశాల బంధనం

నీశుభ వచనం నిత్యము సత్యము
ఏ స్ఫురణనెరిగింతువో.. కృష్ణా...                 ||ఏరీతి ||

వ్యాకుల సంకుల పంకిలమీ కల చీ-
కాకుల లోకుల మేకుల సంకెల

వేకువ నిమ్మని వేడితినయ్యా
ఏ కన్ను తెరిపింతువో.. కృష్ణా...                 ||ఏరూపు ||

Friday, May 23, 2014

రవీంద్రుని గీతాంజలి :- 26 ; నా ప్రయత్నం


మృదుమధురంబుగా కలలమెట్టుల నొత్తుచు దివ్యగానమున్
మదిదరి నాలపించు మహిమాన్వితమూర్తిని, రాత్రివేళ నా
నుదుటను ముద్దుబెట్టు చెలునొక్క నిమేషము చూడలేని ఈ
నిదురను వీడలేని కడు నిర్భర జీవితమెంత వ్యర్థమో !

Wednesday, May 21, 2014

చేతిలోన గీతలున్నా తలరాత మారుతుందా?


చేతిలోన గీతలున్నా తలరాత మారుతుందా
నింగిలోన తారలున్నా పెనుచీకటి ఆగుతుందా               ||చేతి||

ఎండలోన నడిచి నడిచి అలసి సొలసి పోతావు
నీడలోన ఆగిపోయి దారి కదలదంటావు
ఎన్ని అడుగులేసిపోయినా లేని చివర దొరుకుతుందా             || చేతి ||

తడియారిని గుండెకై నీటికొరకు చూస్తావు
నీరులేక కంటినీరు ధారగా చేస్తావు
నీటి చుక్కలెన్ని ఉన్నా ఎడారి నేల పొంగుతుందా                    || చేతి ||

కాగితాన్ని నావచేసి కడలి దాట చూస్తావు
కోర్కెల సుడిలోన చిక్కి మునిగి మాయమౌతావు
గాలిలోన దీపముండగా ఆరకుండ వెలుగుతుందా                    || చేతి ||

ఆకాశపుటంచులకై ఎగుర సాహసిస్తావు
స్వర్గానికి నిచ్చెనేసి నడుమజారిపడతావు
చేయి ఎంత ఎత్తు చాచినా అంబరాన్ని తాకుతుందా                  || చేతి ||

మూడునాళ్ళ బ్రతుకు చూసి మురిసి మురిసి పోతావు
ఆశలెన్నొ పెంచుకుని ఎగసి ఎగసి పడతావు
బ్రతికినేళ్ళు ఎన్ని ఉన్నా చావు ఘడియ ఆగుతుందా               || చేతి ||

Tuesday, May 20, 2014

రవీంద్రుని గీతాంజలి :- 30 ; నా ప్రయత్నం


ఎవడు వాడూ..? .. ఎవడు వాడూ..?  
ఎవడు వాడు? ఎవడు వాడు? ||4||
ఎవడు వాడూ..? .. ఎవడు వాడూ..?

ఏకాకిగానే బయలు దేరితి నిన్ను చేరే దారిలో
నాకు తెలియక ఈ నిశీధిని వెంబడించేదెవరహో!
                                     ||ఎవడు వాడు||
వదలజూచితి తొలగజూచితి
అదను చూచుకు కదలిపోయితి
పదము పదమున నీడలా నను వీడకుండెను .. ఎవడు వాడూ?
                                     ||ఎవడు వాడు||
నా కాలు తడబడ అడుగు అడుగున
ధూళి పొర జళిపించువాడు... ఎవడు వాడు?
నా పెదవి దాటిన మాట మాటకు
కేకలిడి జడిపించువాడు... ఎవడు వాడు ?
                                     ||ఎవడు వాడు||

అతడు నేనే! దేవదేవా! అతడు నేనే !
అతడు నేనే! అతడు నేనే! ||2||

బిడియమెరుగని అహంకారము
తోడు తెచ్చితి ఎంత ఘోరము  ||2||
తడియుచుంటిని సిగ్గు తో నీ
గడపనంటితి వానితో

తడియుచుంటితి... సిగ్గుతో
నీ గడప నంటితి.. వానితో !

Sunday, May 18, 2014

మాయ కమ్మిన మనిషి మంచిచెడులెంచకే చిలకా..!


మాయ కమ్మిన మనిషి మంచిచెడులెంచకే చిలకా..
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!

చేసేది నువ్వైనా చేయించు వాడెవడో ...
             ఆచరణ నీదైనా ఆలోచనెవరిదో....!

పాప పుణ్యాలగోలా నీకెందుకే చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

ఎగిరెగిరి పడుతుంది, అటు ఇటుపోతుంది..
            పట్టుకుందామంటే చేజారిపోతుంది...!

మనసులోని మర్మమింక మరచిపో చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

నిజమనిపిస్తుంది, ఆశకలిగిస్తుంది......
           కలలా కనిపిస్తూ శూన్యమైపోతుంది..!

జీవితమేదైనా జీవించవే చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

Friday, May 16, 2014

రవీంద్రుని గీతాంజలి :- 21 ; నా ప్రయత్నం


అలసి నిదురబోవుచునుండె... ఈ తీరము
అలల వడికబురులు పంపె.. ఆ తీరము
తప్పదేమో ఈ వియోగం
తెప్పపై నా ప్రయాణం
నేస్తమా... శెలవిక..శెలవిక...శెలవిక..||అలసి||

నేలనొరిగి నలిగిన పూవుల వేదనేదో
రాలిపోవు ఆకుల రొదలో గాథలేవో
బ్రతుకిదే భారము
తెగెను ఆధారము
వాసంతమా .. శెలవిక... శెలవిక...శెలవిక..||అలసి||

కనుచూపు నిండిన శూన్యత  .. కాసారమా
మనసులో ఎగసిన చేతన .. సంగీతమా
ఈ గాలి సరాగాలేవో
లో లో తరంగాలయ్యే
కాలమా.. శెలవిక... శెలవిక...శెలవిక..||అలసి||

Wednesday, May 14, 2014

కలలనె కన్పడు మయ్యా దేవా!


కలలనె కన్పడు మయ్యా దేవా
మెలకువ వచ్చిన మొదటికె మోసము       ||కలల||

కన్నులు తెరిచిన కమనీయంబుగ
అన్నుల మిన్నలె అగుపింతురుగా    |2|
చిన్నగనైనా చిత్తమునందున
అన్నన! నీ స్మృతి అరుదుగదయ్యా          ||కలల||

నయనము చూపును నలుదిశలందున
మాయాలోకము మతి చెదరా      |2|
స్వయముగ నీవే రయముగ వచ్చిన
భయపడి ప్రక్కల పారెదనేమో                ||కలల||

తర్కముతోనే తర్జనభర్జన
మర్కట గతినే మందునయా      |2|
అర్కుని జ్వలనము అగ్గిపుల్లతో
మూర్ఖముగా మది పోల్చుట తగదుగ      ||కలల||

నిదురను వీడిన నిత్యము ఏదో
కదనమె కాదా ఖర్మమున      |2|
ముదములుబాధలు ముసిరెడి వేళల
కుదురుగ యుండుట కుదరదు గానీ        ||కలల||

Tuesday, May 13, 2014

ఆనందం

ఆనందమ్మొక దండదీపము తదీయాకర్షణాభాసమున్
తానంబాడ జనాళి ఱెక్క చెదలై తచ్చాడి యచ్చోటనే
నానా వర్ణ మహోర్ణనాభి గృహమం దజ్ఞాన సృష్టిన్ వడున్
జ్ఞానిన్ సైతము గౌళి తాదృశముగా సాపా డహంత్వం బటన్

భావం  :
ఆనందం ఒక .tubelight.
దాని ఆకర్షణకు చేరే ఈసుళ్ళీ జీవులు.
ఈ సృష్టి -  అజ్ఞానం అనే ఒక పెద్ద సాలెగూడు.
అందులో పడిపోతారు.
జ్ఞానులను సైతం అహంకారం
బల్లిలా ఆ ప్రక్కనే ఉండి కబళిస్తుంటుంది

Monday, May 12, 2014

రవీంద్రుని గీతాంజలి :- 19 ; నా ప్రయత్నం


నీ మౌనమూ...
మనసు నిండా మ్రోయనీ
ఈ భారమూ..
తనివి తీరా మోయనీ
                       ||నీ మౌనమూ||

తారల కనుపాపలతో ఎదురుచూచు నిసిలా
ఓరిమి తలదాలిచి నే యుందును తాపసిలా
                       ||నీ మౌనమూ||

చీకటి శెలవు పెట్టి వెడలిపోవు వరకూ
వేకువ తలుపు తట్టి సడులుచేయు వరకూ

సకల జగతి నీ పలుకుల
       వెలుగుల పరవళ్ళలోన
              తడిసి మునకలేయువరకు
                       ||నీ మౌనమూ||

నీ పదాల విహంగాలు
నా గొంతు గూటిలోన
జనిన లలిత గీతాలై
నింగిని రవళించు దాకా….

నీ స్వరాల మరందాలు
నా మది పూదోటలోన
వికసిత సుమగానాలై
భువిని పరిమళించు దాకా …..

                       ||నీ మౌనమూ||

Friday, May 9, 2014

రవీంద్రుని గీతాంజలి : -16 ; నా ప్రయత్నం


చాలును చూచితిన్ బ్రతుకుజాతర నందున నీ వరమ్ముగా
దేలితి సౌఖ్యసంపదల దేహము నొందిన కారణమ్ముగా
గోలయొ గానమో సడుల గ్రుచ్చితి మ్రోగితినెంతొ దైవమా
కాలము కాదొ? నీ నగవు గాంచుచు మౌనముగా భజింపగన్ !

Wednesday, May 7, 2014

రవీంద్రుని గీతాంజలి : -15 ; నా ప్రయత్నం



నీ కోసమె యీ జీవము ! నా గానము !
నీ కొలువున ఈయవా  చిరు స్థానము !
                              || నీ కోసమె||
ఈ జగతిన నా పనేమిటి... శూన్యము
పాడు చున్నది ఏవో పాటలు ప్రాణము
                               || నీ కోసమె||

నిశను నీరవ దేవాలయమున
ఆశ తీరగ ఆనతీయుము  ||2||
శాసింపుమా  పవళింపుసేవకు
        ప్రభూ....! ప్రభూ... ! ప్రభూ....!
శ్వాస గానము చేసి పాడెద ఒసగుమీ ఈ పుణ్యము !
                               || నీ కోసమె||

వెలుగుతీగెల పసిడి వీణియ              
చలితమయ్యే సుప్రభాతము  ||2||
గాలి గుసగుసలాడు వేళను
           ప్రభూ....! ప్రభూ... ! ప్రభూ....!
నిలుపు నీ సాన్నిధ్యము కలుగనీ  సమ్మానము !
                               || నీ కోసమె||