Wednesday, May 21, 2014

చేతిలోన గీతలున్నా తలరాత మారుతుందా?


చేతిలోన గీతలున్నా తలరాత మారుతుందా
నింగిలోన తారలున్నా పెనుచీకటి ఆగుతుందా               ||చేతి||

ఎండలోన నడిచి నడిచి అలసి సొలసి పోతావు
నీడలోన ఆగిపోయి దారి కదలదంటావు
ఎన్ని అడుగులేసిపోయినా లేని చివర దొరుకుతుందా             || చేతి ||

తడియారిని గుండెకై నీటికొరకు చూస్తావు
నీరులేక కంటినీరు ధారగా చేస్తావు
నీటి చుక్కలెన్ని ఉన్నా ఎడారి నేల పొంగుతుందా                    || చేతి ||

కాగితాన్ని నావచేసి కడలి దాట చూస్తావు
కోర్కెల సుడిలోన చిక్కి మునిగి మాయమౌతావు
గాలిలోన దీపముండగా ఆరకుండ వెలుగుతుందా                    || చేతి ||

ఆకాశపుటంచులకై ఎగుర సాహసిస్తావు
స్వర్గానికి నిచ్చెనేసి నడుమజారిపడతావు
చేయి ఎంత ఎత్తు చాచినా అంబరాన్ని తాకుతుందా                  || చేతి ||

మూడునాళ్ళ బ్రతుకు చూసి మురిసి మురిసి పోతావు
ఆశలెన్నొ పెంచుకుని ఎగసి ఎగసి పడతావు
బ్రతికినేళ్ళు ఎన్ని ఉన్నా చావు ఘడియ ఆగుతుందా               || చేతి ||

No comments: