Thursday, December 31, 2009

తేదీ మారింది!

ఒక పిపీలికం కదిలింది..బరువుగా కదిలింది!
క్రమశిక్షణతో కదిలింది

జీవచ్ఛవంలా పడిఉన్న బొద్దింక ..
ఒక్కొక్క చీమ వచ్చి కాస్త కాస్తా కోసుకు పోతున్నాయి.. మోసుకు పోతున్నాయి.
తునకలు... పార్టీలలో కేకుముక్కల్లా
కాలకింకరుల నోట్లో

ఓ చీమది పెద్ద తునక.. ఆ యేడు సృష్టిలో పెను మార్పులు

అప్పుడప్పుడు ఓ కాలు అసంకల్పితంగా కదులుతుంది... ఏ మహానుభావుడు పుట్టాడో
జీవం ఉంది.. అనిపించడానికి!
ఒంటికాలుతో ఆ బొద్దింక..క్రిందమీదైన బొద్దింక

సృష్టి అంతం అయ్యేవరకూ కదులుతూ ఉంటాయి
చీమల బారులు
చివరన ఓ నాలుగు కలిసి ఒకేసారి మోసేస్తాయి
ఆపై అక్కడ ఏం ఉండదు
అది నిర్ధారించుకునే కొన్ని చీమలు
ఆపై స్తబ్దత
కాలం లేదు... నిలువలేదు
ఒక క్రొత్త సృష్టి వెతుకులాటలో ఏళ్ళు చెదిరిపోతాయి.
భూతకుహరంలో భవిష్యత్తును సృజిస్తూ ..రాణి చీమ!

Wednesday, December 30, 2009

రెక్కల పురుగు

రెక్కల పురుగా ఓ.. రెక్కల పురుగా
ఎందుకనీ ఉన్నావు రెక్కల పురుగా
              ||రెక్కల||

ఎంత రాచకార్యమున్న అంతటి పరుగా !
              ||రెక్కల||

కాలుగాలినట్టు తిరిగి జీవితమంతా
కాలి బూడిదయ్యేందుకు జీతమెంత?
కోరికోరి చేరతావు నిప్పుల చెంతా
కడకు నిన్ను పంపేనా కాంతి కౌగిలింత

ఇల్లు కాస్త దిద్దుకోవె దీపముండగా
వళ్ళు కాలిపోయినాక ఆకులేల దండగా!
              ||రెక్కల||

తళుకు బెళుకు దీపకళిక కళుకు చూపుతున్నదా
కనుల కలల వెలుగుపొరలు గప్పి వేచి యున్నదా
చీకటంటె భయము నేర్పి చేర పిలచుచున్నదా
పసిడి వెల్గు లేనిపోనివన్ని జూపు చున్నదా

కోర్కె మంట రేపుతాది మనుషులలోనా
మంటె కోర్కె రేపిందా జోడు ఎరక కూనా!
              ||రెక్కల||    

ఎగిరి ఎగిరి పడిపోవుటె నీకు నైజమా
ఘడియలోనె సమసిపోవు నీ ప్రాణమా
నిప్పు తోటి చెలగాటం నీ స్వభావమా
తప్పు చేసి ముప్పుతెచ్చు కొనుటె నీకు సౌఖ్యమా

ఈసుళ్ళకు కాలిపోవుటేమి ధర్మమూ
ఆ..ఈశుడాజ్ఞ ఇచ్చెనేమొ నీ ఖర్మము!
              ||రెక్కల||   

Friday, December 11, 2009

నెరుడా కవిత్వం - నా ప్రయత్నం

నెరుడా వ్రాసిన only death  అన్న కవితకు నా అనువాదం. దీని ఆంగ్ల మూలం, ఈ కవితను ఇంతకు ముందు అనువదించిన శ్రీశ్రీ, బొల్లోజుబాబా, భైరవభట్ల కామేశ్వరరావుగార్ల అనువాదాలు ఇక్కడ చూడవచ్చు.

మృత్యోరద్వైతం!

ఒంటరి ప్రేతభూములు
సమాధులనిండా పీకలు నొక్కబడిన ఎముకలు
మనసు తన నీడలోకి..నీడబొరియల్లోకి.. దిగ్గారుతూ
పై తోలు నుంచి లో లోతు లోకి 
గుండె లోయల్లోకి అనంతంగా జారుతూ
విషధి అడుగంటుతున్న నౌకలా .. మరణిస్తాం!

అక్కడ పీన్గులు
ఆ కాళ్ళు పలల శిలలు
ఆ బొమికలలో మృత్యువు
అనాహత స్వనిలా
కుక్కలేని కక్కరంలా
అక్కడక్కడ ఒకానొక ఘంటికనుండి.. ఒకానొక సమాధినుండి పిచ్చలించుచూ
చిత్తడిలో ఉబ్బుతూ ..ఒక శోకమో.. ముసురో!

ఒంటరైన నా చూపు ముంగిట
కడలిలో తేలుతున్న ఖట్టికలు
వివర్ణ విగతుల బరువైన లంగరు
నిర్వీర చూలికలతో అలివేణులు
పాండు దెయ్యాల్లా పిండొలికిన రొట్టేలవాళ్ళు
తలపోతలో  చిట్టాపద్దులతో సంసారిస్తున్న కన్నెలు
నిర్జీవనిర్ఝరికి నిటారుగా ఎదురెక్కుతున్న శవపేటికలలో
ఎండిన రక్తపుచారలాంటి నది
రొప్పుతూ ఎదురీతలో తరంగిస్తున్న మృత్యు నిర్ఘోష  
తరంగిస్తున్న నిశ్శబ్ద నిర్వేద నిర్ఘోష

ఆ పిలుపు పరువడి చావు ఉరవడి
పాదంలేని పాదుకలా, యోధుడులేని కవచంలా
తలుపుపై ఉంగరపు చరుపు
వేలులేని రాయిలేని ఉంగరపు చరుపు.. వేయమంటూ
నోరు నాలుక గొంతు లేని అరుపు .. మ్రోయమంటూ.. ఆ పిలుపు!
నీకు తప్పక వినబడుతుంది చావు అడుగుల సవ్వడి
నిశ్చలద్రుమనిశ్వాసం లాంటి ఆ దుస్తుల రొద

తెలియదు. ఎరుకచాలదు ..
ఒక గుడ్డి నమ్మకం
మృత్యుగీతిది పూల రంగు
వినీల గగనంలో విరిసి
మట్టి లో కలిసిన పూవుల .. ఊదారంగు!
కారణం
మృత్యువు సాంద్రహరితానన
మృత్యువు తీక్ష్ణ హరితేక్షణ
తడి పూరేకు వాడితనం తో
ఓ కరడుగట్టిన వ్యగ్రత కలిసిన గంభీరమైన రంగు

అంతటితో ఆగదు..  మృత్యువుది శతముఖియానం
మృతులకై నేలంతా జుర్రుతూ...
అసలు మృత్యువే శతముఖి!! శవాల వెతుకులాటలో దాని నాల్కలు..
చీకటి కంబళినల్లే దాని సూదికి దారమవసరమై
శయ్య కమ్మీలలోంచి మెల్లగా ప్రాకుతూ
దుప్పటీ అంచుదారిని .. వ్యాపిస్తూ
ఒక్కసారి కరాళిస్తుంది..
పైముసుగులనుబ్బరించే ఆ గాఢ నిర్ఘోష!
అంతే.. రేవుల్లోకి చొచ్చుకొచ్చేస్తున్నాయి ఖట్టికలు
ఆ తీరంలో కవచధారియైన ముదలియారు ... మృత్యువు!!

Tuesday, December 8, 2009

ఎడారి

కాల బెహారితోడ చిర కాలము పోవుచు కాందిశీకులై
నేలను కొల్చుచూ ఇసుక నేలల చెక్కుచు సాగి గూటిలో
వ్రాలెదమోయి నీ తొలి నివాసము నీ మజిలీని చేరి చి-
త్రాల నొకింత చూచి పద లంగరు ఎత్తు మరో బిడారుతో!

భువన గుడారమో వెలుగు పుంజపు నీడయొ భ్రాంతియో కనుం-
గవలకు దోచెనెద్ది? అట కన్పడె నద్భుత వస్తుజాల మం-
దు వెదుగులాడగా స్ఫటిక దుర్భిణి తోడ ఫకీరు చూచి నీ
వెవరవొ ఇందు చూడమని యిచ్చెను! యంత్రము నాదె యయ్యెనే!

అది యొక గాజుముక్క ఇక అందున నిల్చెను నాదు మానసం
బు దినము లిట్లు దాని కడ పోవుచునుండె నదేమి మాయయో
వదలక పట్టుకుంటి పలు వత్సరముల్, అటుపిమ్మటద్దియే
వదలక నన్ను పట్టుకొనె ! భారమె నేనను యూహ మోయుటల్!

చూపెను ఈ జగత్తునది చూపెనెడారిని ఎండమావులన్
నా పసికాలమంతయు అనాధగ గన్పడె జ్ఞాపకాలలో
రూపము మారె నాకనుల లోకము మారె గుర్తు వీడె నే
శాపము సత్యమయ్యెనొకొ స్వంతముగా యనిపించె సర్వమున్!

క్షణముగ సాగు వారములు సంతసమొందిన వేళలందు ఓ
క్షణము మహా యుగమ్మువలె కన్పడు కష్టము కల్గగా ! నిరీ-
క్షణమున రేపుమాపుకొరకై బ్రతుకంతయు బోవు కాల బేరమున్
క్షణము క్షణమ్ముగా నెటుల గాంచుదు నీ క్షణమాత్రసృష్టిలో!

నడచిన త్రోవనే నడచి నాబ్రతుకంతయు వెళ్ళిపోయె! నే
తడిమిన శిల్పముల్ శిలలు దాచిన రత్నములన్ని రాళ్ళు! ఈ
గడచిన దంత స్వాప్నికము కాల మరీచిక ముట్టడించె నన్!
తడిచినుకేదొ సత్యమని దాడినెదుర్కొనె , రాలె నేటికిన్!

జీవితమన్న నేమి? పలు చింతలొకింత భ్రమించి, హాయికై
దోవలెడారిలో వెదికి, దోషములెంచి, భరించి, ఆశగా
కావలి యెండమావులకుగాచి, తపించుచు నీటికోసమై,
ఈ వలయంబులో దిరిగి, ఈ కలలో నిజమౌటయే సుమా!

Saturday, December 5, 2009

పిలుపు

అమావాస్య రాతిరిలో
ఆ శ్మశాన వాటికలో

రమ్మనీ .. రారమ్మనీ
పిలుస్తున్నాయి.. కంకాళాలు
అరుస్తున్నాయి .. కళేబరాలు.. మానవ కళేబరాలు

కూసిందొక తీతువు పిట్ట
నవ్విందొక బావురుకప్ప

నక్క ఊళలు గుడ్లగూబలు
నీకోసం చూస్తున్నాయి
నీ చితికై వేచున్నాయి!

వినలేదా మరణ మృదంగం
కనలేవా మృత్యువు హర్మ్యం

రాబందుల రాజ్యంలో
పిశాచాల లోకంలో
నీకోసం చోటుంచాను
నాప్రక్కనె పాతేస్తాను

నీచుట్టూ రాతిరి నలుపు
నేలంతా బూడిద తెలుపు
నీచితిపై మండే ఎరుపు
నీకిదియే ఆఖరి వెలుగు

చెరిపేస్తా రంగుల భేదం
కలిపేస్తా సంతసఖేదం

గతమేలే నీకీ లోకం
ముందంతా శాశ్వత మైకం

Tuesday, December 1, 2009

నేను - నా జీవితం

`నాకు జీవితం ... నిరాసక్త వ్యసనం
జీవితానికి నేను .. అజాగళస్తనం'

ఈ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం... కాల ప్రవాహం

చిత్రం! ఇది గుర్తొచ్చే కొద్ది క్షణాలూ మాత్రం ..ఇది అబద్ధం.
ఆ క్షణం.. కాలం జడం

ఆ అబద్ధపు క్షణాలకై, దానిని నిజం చేస్తూ
ఒకరినొకరు భరిస్తున్నాం!

Sunday, November 29, 2009

చావు

                                   
ఆ ఒక్క క్షణం..!

ఏవో అజ్ఞాత శక్తులు తమ హస్తాలతో అవయవాలన్నిటినీ
నలిపేస్తున్నాయి..!
హృదయ మంథరాన్ని చుట్టి చిలికేస్తున్న సిరధమనులు
ఎక్కడి కక్కడే చిక్కటి రక్తాన్ని స్ఖలిస్తున్నాయి..!
విహ్వలుడైన చిత్రగుప్తుని ముందర నగ్న తాండవం చేస్తున్న
నా జీవిత పుటల పద ఘట్టన ..
పంచ ఘోటక కరాళముగా పల్లవించింది...!
అసంకల్పిత ప్రతి చర్యగా...
నా నరనాడుల తంత్రులు ఒక్కసారిగా తెగిపడుతూ చేసిన
వికృత నాదం...
నిబిడీకృత శూన్యంలో తరంగించి ..ఘన మౌనంగా
ప్రతిధ్వనించింది..!
క్రిందకు విసిరిన ప్రతీ తరుణంలో రెట్టించి పైకెగిరే అహం
అనంతమైన అగాధంలోకి జర్రున జారుతోంది!
ద్వంద్వాలకు మరిగిన వివేకం ఈ స్థితిని గుర్తించలేక,
మూసి ఉన్న రెప్పలను రెండుసార్లు రెపరెపలాడించి..
కన్నుమూసింది!
భళ్ళున పేలింది!
ఏమిటో...ఎక్కడో?!
ఛిద్రమైన సర్వస్వం!
ఇంత అలజడి జరుగుతున్నా ఏమీలేనట్లు, ఏమీకానట్లు
స్థంబించిన నా ఊపిరి..ప్రకృతి.. జగతి!
బహుశా.. నా ఊపిరాగిన ఆ ఒక్క క్షణం.. విశ్వం ఊపిరి
తీసుకుంటున్నాదేమో!! ...సమతుల్యానికి ప్రతీకగా!
ఈ చలనరాహిత్యానికి చెమర్చిన కళ్ళు.
నాకై కారిన ఒకే ఒక కన్నీటి బొట్టు.. నా కంటిదే!!

దేహంలో ఎక్కడో ఓ మూల ఓ కణం నిశ్శబ్దంగా
నిష్క్రమించింది!!