Wednesday, November 10, 2010

సడి

శ్రీ చావా కిరణ్ గారు ఇచ్చిన సన్నివేశానికి (ఇక్కడ చూడండి) నాకు తోచిన పాట.

సడి.. చిరు సడి ..వినబడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి  ||సడి||

గుండియలోన జారిన కన్నుల నీటి తడి
తుడిచిన చల్లని గాలి ఒడి                 ||సడి||

గగనపు గుడిలో మబ్బుల గడిలో
ఆడే గువ్వల సవ్వడులు

వడివడి అడుగుల జలతరంగముల
బేడిస గుంపుల సందడులు

వినువీధులలో విహరించేందుకు
విధి చేతలనే వివరించేందుకు
పదపడి రేపే తలపుల తాకిడి

సుడి.. అలజడి.. తొలగిడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి  ||సడి||

కడిమి వనములో తడబడు నడకల
వెదుకులాడెనే అలికిడినో

నిబిడి శాంతిలో గుడిసె నీడలో
వెలువడే నదే తెలివిడియో

శిలశిల్పమ్మౌ ఇడుగడలెన్నో
కుడియెడమలలో యెడమెంతో
ప్రకృతి బడిలో నిశ్చల పోడిమి

ముడి .. విడివడి.. తనివిడి
అదే పాటుగా .పాటగా ..నిలబడి.. వినబడి  ||సడి||

Tuesday, September 28, 2010

పరుగుపందెంలో...!

ఆమె : ఓ! క్రొత్త మొబైల్! బాగుంది
అతడు : ఇది పరుగుపందెంలో గెలుచుకున్నా
ఆమె (నవ్వుతూ) : నువ్వొక్కడివే పాల్గొన్నావా?
అతడు : లేదు! ముగ్గురం ! మొబైల్ ఓనర్, పోలీస్ కానిస్టేబుల్, నేను.

ఇది ఒక ఎస్.ఎమ్.ఎస్ జోక్
నవ్వుకున్నా..
పని యొక్క విలువను బేరీజువేసే పద్ధతిని చూసి
మనిషిని గుర్తించే దృక్కోణాన్ని చూసి
వాటిల్లో వచ్చిన మార్పును చూసి..

మంచి చెడులనే సంకుచిత పరిధినుండి
ధర్మాధర్మాలను దాటి..
న్యాయాన్యాయ సంకెలల తప్పించుకుని
గెలుపోటముల విశాల దృక్పథం లో
ఆలోచిస్తున్నాం... అంగీకరిస్తున్నాం

కీర్తి అపకీర్తి పర్యాయపదాలైనాయి
వాటికి వ్యతిరేకం మూర్ఖత్వం
అమాయకత్వం
అనామకత్వం
వ్యర్థపదార్థం!

బహుశా మనం
ఇలా మానిటర్ ముందు కూర్చుని
చోద్యం చూడకుండా
ఆ పరుగుపందెంలో పాల్గొని ఉంటే
గెలుపు ఓనర్ ని వరించేదేమో!

Sunday, September 19, 2010

ఊబి

చుట్టూ బురద పెదవికి రంగేస్తోంది.. మెదడును మింగేస్తోంది
మెల్లమెల్లగా దిగిపోతున్నాం దిగబడిపోతున్నాం
దానిలోకి నేను .. నాలోకి అది

ఒక చిన్న ... చూపు చాలు .. కూరుకుపోతున్నా
ఒక చిన్నచూపు చాలు .. కూరుకుపోతున్నా
చూస్తుండగానే...తెలిసి..  తెలియకుండా
మౌనంలోకి లాగేస్తుంటే శూన్యంలోకి చుట్టేస్తుంటే
నిశ్చలంగా.. పద్దతిగా
గించుకుంటూ.. చిందరవందరగా

ఎవరూ లాగటం లేదు
నా బరువుకే .. కూరుకుపోతున్నా
నాలో నేనే ... కూరుకుపోతున్నా
ఇది సాలెగూడు కాదు.. ఆహారమైనా కాలేను
ఇది ఒక ఊబి!... మదిచూపుమేర!

కుంటికాలు కొట్టుకుంటోంది

ఇక్కడ జడత్వం, చైతన్యం
ఒకే దిశ కు సూచకాలు
ఒకే స్థితికి సాధకాలు
భూస్థాపితానికే సహాయకాలు

కుంటికాలు కొట్టుకుంటోంది

కాపాడే చెయ్యి
తొక్కిపడేసే కాలు
ఏదైనా ఒకలాగే
నాతోనే.. లోలోకి

Saturday, September 11, 2010

గుండె బరువు

నిన్ను గుండెల్లో దాచాను...
గుండె పగిలింది..!

పగిలిన హృదయ శకలాల్లో...
నీ రూపం చూడాలని...
పిచ్చి ప్రయత్నం!!

ఒక్కో ముక్కా తీస్తున్నా..
తరచి తరచి చూస్తున్నా...
నీవు లేక విసిరేస్తున్నా..

మనసు... తరిగిపోతోంది..
బరువు... పెరిగిపోతోంది!!

నువ్వేమో కనిపించటంలేదు...
నే కూడా కనుమరుగవుతున్నాను!!

Thursday, July 8, 2010

నిద్దుర

అహం ఒక మైక్రోస్కోప్
చిన్న తేడాలను కూడా పెద్దవిచేస్తుంది
ప్రేమ ఒక టెలిస్కోప్
బాగా దగ్గరైనట్లు భ్రమింపజేస్తుంది

ఆ రెండూ ప్రపంచాన్ని చూపించే రెండు కళ్ళు
అసమానంగా చూపిస్తాయి.. అనుమానంగా మారుస్తాయి.
అస్తవ్యస్తం చేసేస్తాయి

కళ్ళజోడు.. మనం పెట్టుకున్న కట్టుబాట్లు
విలువల చలువటద్దాలు
ఇట్టే పగిలిపోయే.. గాజుముక్కలు

అవసరానికి పెట్టుకుంటాం
చేత్తో తిప్పుతుంటాం
సులువుగా మరచిపోతుంటాం
చిరాకేస్తే ప్రక్కన పడేస్తాం.


నిద్దుర ఎంత సుఖమో!

Friday, June 18, 2010

బల్లి పాట

(ఐ.ఐ.ఎస్‌సి మెస్సులో వంకాయ అన్నంలో వచ్చిన బల్లిని చూసి వ్రాసినది)

ఏడి నూనేలోనా ఏగేగిపోనాది
ఎందుకొచ్చిందో ఏమో ఎర్రినా బల్లి ||2||

కడుపు చే బట్టుకొని కాళ్ళీడ్చుకొచ్చిందొ
కడివెడు కన్నీళ్ళూ కారగా వచ్చిందొ

కరువుగాలమొచ్చిందొ కరచు డొక్కయ్యిందొ
కూటికోసమొచ్చిందొ కూలిసేద్దమనుకొందొ

దొరలయిందుకొచ్చింది దోరగా ఏగింది
దూలతీరిపోనాది దొంగనా బల్లి ||2||  |ఏడి నూనే|

ఆశ కలిగిందేమో ఆ సిట్టి బొజ్జకి
కూసింత కూరముక్క కొరుకుదామనుకొందొ

తా సేయి సాచిందో దోసిలే పట్టిందో
ఇసుగొచ్చిందేమో కూసుని కూసుని

ఉష్..! ఉష్‌ష్!  … ఉష్..! ఉష్‌ష్!

" ఉస్సుసని తోలి నా ఊసునే మరచేరు
ఈసుడా! నా బతుకు ఇలువేమిటయ్యా?! " 

అడుగుదామనుకొందో అడుగంట కాలింది
పీడ ఇరగడైపోయే పిచ్చినా బల్లి ||2||  |ఏడి నూనే|

Tuesday, June 8, 2010

అసహనం!!

ప్రళయ ఝంఝా మారుత ప్రభంజనంలో
కూకటి వేళ్ళతో పెళ్ళగింపబడిన వృక్షాలై నా నరాలు నానుండి త్రుళ్ళిపోవాలి
బీటలువారిన భూమిలా నా చర్మం చీరిపోవాలి. 
నిలువెల్లా నన్నునేను చీల్చుకుని ..పిచ్చిగా దిక్కులు పిక్కట్లిల్లేలా అరవాలి.
ఆ ధ్వని నా చుట్టూ పరిభ్రమించాలి. నాలో ప్రతిధ్వనించాలి.
అగ్నిపర్వతోద్గార ద్రవానలమై  నలుదిక్కుల చిమ్మేయాలి 
కుప్పించి ఎగసిన కరి శతమ్ముల క్రింద నలిగి అణిగి భూస్థాపితం కావాలి .
మహోగ్రతరంగాలు ఉక్కుమ్మడిగా మీద పడి శరీరాన్ని తుత్తునకలు చేసేయాలి.  
ప్రచండ వేగంతో భూమి పైపొరలను తాకుతున్న ఉల్కలా నిలువెల్లా మండిపోయి, ప్రిదిలి పోయి ప్రేలి పోవాలి.
ఉగ్ర చైతన్యంలో ఉడికిపోవాలి
మహోగ్ర చైతన్యంలో మ్రగ్గిపోవాలి
రుద్ర చైతన్యంలో ఛిద్రమవ్వాలి
క్రిక్కిరిసిన చైతన్యంచే నా అస్థిత్వంలోని ప్రతి కణం, ప్రతి క్షణం ధ్వంసమవ్వాలి.
విశ్వ చైతన్య విలయ విస్ఫోటనలో నేను విధ్వంసమవ్వాలి 
జరగాలి ...జరిగిపోవాలి !!
కృష్ణబిలోన్ముఖంగా నా పయనం
ఆ అంచు చేరే వరకే .. ఈ అసహనం

Wednesday, May 19, 2010

ఈ జన్మకిది చాలు మనసా...!

ఈ జన్మకిది చాలు మనసా...! నీవిక
మాజీల లెక్కలో మరియాదగా జేరు    ||ఈ జన్మ||

మాయలోకములోన మత్తెక్కియుండినా      |2|
హాయిగా సడిలేక ఆదమరచిన ఘడియ ||ఈ జన్మ||

కామ క్రోధాదులే కదులుతూ యున్నను   |2|
ఏ మార్గమూలేక ఏడుపై అణిగేను      ||ఈ జన్మ||

మంచి బుద్ధులు లేవు మచ్చుకైనా గాని  |2|
కంచుమ్రోతలు కాస్త గణనీయమై తరిగె||ఈ జన్మ||

ఎరుగని దానికీ ఎదురు చూపులు ఉన్న     |2|
ఎరుగలేనని నీవు ఎరుకగల్గిన వేళ   ||ఈ జన్మ||

అన్ని కావాలని ఆరట పడితేను        |2|
ఉన్న నాలుక కూడ ఊడి పోవును గనుక  ||ఈ జన్మ||

తప్పొప్పులింకనూ తలబరువు కాలేదు    |2|
తప్పుకో కూసింత తంటాలు నీకేల     ||ఈ జన్మ||

తొలగకున్నా గాని దోషంబులేవియూ    |2|
పలుమారు జేసేటి బాధ తప్పును గాన ||ఈ జన్మ||

Monday, May 17, 2010

ఎరుక

చేతిలో ఉన్నది చిత్తానికే ఎరుక
రాతిలో ఉన్నది రామప్పకే ఎరుక       ||చేతి||

వానకురిసెడి వేళ వనమయూరికి ఎరుక
గున్నమామిడి పూత కోకిలమ్మకు ఎరుక
ఏనుగొచ్చెడి దారి ఎడమకాలీ క్రింద
పీనుగై పడి ఉన్న పేడ పురుగుకు ఎరుక
                                        ||చేతి||
ఆశతీరిన వాడి కత్యాశయే తెగులు
ఆశ తీరని వాని కావేశమే మిగులు
కాష్ఠంలొ కాలేటి కట్టె ఏమెరుగునో
కాశిలో ఉన్నట్టి కాలభైరవుకెరుక
                                        ||చేతి||
కొమ్మమీద యున్న కోతి గెంతుట ముద్దు
రెమ్మమీది పిట్ట లెగిరిపోవుట కద్దు
బొమ్మ జెముడు లోని భూతమేంజేయునో
తమ్మిచూలిని గన్న తల్లిగారికి ఎరుక
                                        ||చేతి||
నచ్చిన నా మాట నవనీతముల కుండ
మెచ్చలేవు నీకు మెదడు కాలిన యుండ
పిచ్చి పాటలలోని పెంట ఎంతున్నదో
లచ్చి మగడౌ సూక రాల రాజునకెరుక
                                        ||చేతి||

Sunday, May 2, 2010

సూరీడు కథ

( ఈ కథ సంపుటి పక్ష పత్రిక లో వచ్చింది. (తే.దీ : 31-03-10 ; 14-04-10) )


తెలతెలవారుతోంది... ఆకుల చాటుగా, గగనం చేస్తున్న లేలేత కిరణాల అలికిడికి చిగురాకుల మత్తు కరిగి బిందువులుగా రాలుతున్నాయి. ఆ చిరుతుంపలు శరీరాన్ని గిలిగింతలు పెడుతుంటే నిద్రలేచాడు సూరీడు. ఒక్కసారి వళ్ళువిరుచుకుని చుట్టూ చూశాడు. తానున్న కొండ చరియపై నుండి చూస్తే ఆ క్రింద ఉన్న పచ్చని లోయ మబ్బుతెరల చాటున దోబూచులాడుతోంది అనిపించింది. పక్షుల కిలకిలలు అతని మనసులో తరంగిస్తున్నాయి. అరవిచ్చుకుంటున్న పూల వాసన అతని గుండెలనిండా వ్యాపించింది. గగనంలో సూర్యుడు, కొండపైని సూరీడూ.. ఇద్దరూ కదిలారు. దినచర్య ప్రారంభం అయ్యింది.
సూరీడికి పదహారేళ్ళు. ప్రపంచాన్ని తెలుసుకోవడమే కాక తర్కంతో తలకెక్కించుకునే తొలి రోజులు. అందులో ఒక రోజు తాత దగ్గరకు చేరాడు. ఆ తాత ఎక్కడివాడో తెలియదు. అక్కడ ఉన్నాడు. అంతే. అతనికి తెలియనివి లేవని అంతా అంటారు. సూరీడికి అది నమ్మిక. తాత లోయలోకి చూస్తున్నాడు. కనుచూపుమేరంతా పచ్చగా ఉంది. తాత దగ్గరనుండి వినీవినిపించకుండా నిట్టూర్పు! `ఏమైంది ? ' అడిగాడు సూరీడు. `ఈ పచ్చదనం బాగుందికదూ?' అడిగాడు తాత. లోయవైపు చూశాడు. బాగున్నట్టనిపించి `ఊ! ' కొట్టాడు సూరీడు. `నీకిది చాలా ఇష్టం కదూ! ' అది ప్రశ్నో కాదో తెలియదు. కానీ అది సూరీడు మనసులో అంతవరకూలేని ప్రశ్నను రేపింది. తనకిది ఇష్టమా? సూరీడు మనసులో ప్రశ్న ఉదయించింది. అవును! అది నిజం! ఇది తనకి చాలా ఇష్టమైనది! సమాధానం కూడా అప్పుడే ఉదయించింది! ప్రశ్నే సమాధానానికి ఆధారం. ప్రశ్న తోనే సత్యం ఆవిష్కరింపబడుతుంది. ప్రశ్నలు ఆగిపోయిననాడు నిజం తన ఉనికిని కోల్పోతుంది. మళ్ళీ `ఊ’ కొట్టాడు సూరీడు. తాత మాట్లాడలేదు. సూరీడికి కొంచం అర్థమయ్యింది. ఈ లోయలో పచ్చదనానికి ఏదో అయిపోతుంది. తనకిష్టమైన లోయ... బాధతో అతని మనసు మూలిగింది.
సూరీడు రోజూ లోయవంక చూస్తాడు. అంతా బాగుందని నిర్థారించుకుంటాడు. రోజులుగడుస్తున్నాయి. పచ్చదనం తగ్గుతోందేమో తగ్గిపోతోందేమో అన్న దిగులు పెరుగుతోంది. రేపో ఎప్పుడో ఏదో జరుగుతుంది! సూరీడుకి తెలుస్తోంది. అనుకున్నట్లుగా, అతని మనసు చెప్పినట్లుగా, ఒకనాడు అతనికి ఎక్కడో చిన్న తేడా కనిపించింది. దూరంగా ఒక చిన్న మచ్చ! కాస్త పచ్చదనం తగ్గినట్లుంది. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ మచ్చ పెద్దదౌతోంది. తాతనడిగాడు ఏమిటా మచ్చ అని? తాత ఆలోచించాడు... సూరీడిని చూసి `ప్రకృతి కి ఏర్పడిన మచ్చ .. మనిషి!'' అన్నాడు. సూరీడుకి చాలా ఆత్రంగా ఉంది. తాతను వదలేదు. `అక్కడ ఒక భవ్య హర్మ్య నిర్మాణం జరుగుతుంది. ఆ రాజుగారు తన కుమారుడు పెరిగాక చేసే వన విహారానికి అనువుగా అక్కడ నిర్మిస్తున్నారు.' తాత సూరీడు కేసి తదేకంగా చూస్తూ చెప్పాడు. సూరీడుకి ఇది నచ్చలేదు. `వనవిహారానికి అక్కడ ప్రకృతిని పాడు చెయ్యాలా? ఇక్కడ నుండి ఒక పెద్ద మచ్చలా కనిపిస్తోందంటే ... ఎంత పెద్ద ప్రదేశమో! అక్కడ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు ...? అసలు ఇంత దారుణం చెయ్యాలని ఎలా అనిపిస్తుంది. 'సూరీడుకి కోపం పెరిగిపోయింది. దీనిని ఆపాలి. ఎలాగైనా ఆపాలి. తతదగ్గరకు వెళ్ళాడు. `తాతా నేను వెళ్తా! రాజుగారిని ఇది ఆపమని చెప్తా! లోయలో పచ్చదనం పోకూడదు!" నిశ్చయంతో అన్నాడు. తాత చూశాడు. చిన్న నిట్టూర్పు వినపడీ వినపడకుండా వచ్చింది. సూరీడుకి అది వినపడలేదు. అతను బయలుదేరాడు.
అలా ప్రయాణిస్తూనే ఉన్నాడు. దూరంనుంచి అందంగా కనిపిస్తున్న లోయ, పచ్చదనంతో నిండి ఉన్న లోయ, నడకకి అంత సౌకర్యంగాలేదు కానీ తదేక దీక్షతో వెళ్తున్న సూరీడుకి ఇది తెలియటంలేదు. తెలిసే సమయానికి అతడు చాలా దూరం వచ్చేశాడు. రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటుతున్నాయి. అడవి పల్చబడుతోంది. చెట్టేక్కి చూశాడు. దూరంగా ఆకాశాన్ని తాకడానికి ఉరకలేస్తున్న కట్టడం. ప్రేలడానికి సిద్దమౌతున్న అగ్నిపర్వతంలా కనిపించింది సూరీడికి. వచ్చిన దారివైపు చూశాడు. ఆశ్చర్యం తను వచ్చిన కొండకూడా ఇప్పుడు అంతే ఎత్తులా కనిపిస్తోంది. ఆశ్చర్యపోయాడు. అతని మదిలో చిన్న అలజడి. నడకసాగింఛాడు.
ఆ భవనం వైపుగా ఒక కాలిబాట తగిలింది. ఆ దారిపట్టాడు. దారి వెడల్పయ్యింది. అక్కడక్కడ నరకబడిన చెట్టు మొదళ్ళు కనిపిస్తున్నాయి. అతని మనసు బాధగా మూలిగింది. ఎదురుగా ... చలువరాతితో చేసిన రహదారి. అతని కాలు ఆ పాలరాయి పై వేశాడు. ఆ స్పర్శ అతనికి ఎంతో సుఖంగా అనిపించింది. వసంతంలో ఉదయాన్నే చెట్లక్రింద పరచి ఉన్న పూలపై నడుస్తూ ఉంటే కలిగే అనుభూతి గుర్తుకు వచ్చింది. నడుస్తున్నాడు. హాయిగా అనిపించింది సూరీడుకి. అంతవరకూ అడవిలో రాళ్ళల్లో ముళ్ళల్లో నడిచిన అతనిపాదాలకు ఈ స్పర్శ నచ్చింది. దారి సాగుతోంది. ఎంతో మంది యాత్రికులు వస్తున్నారు వెళ్తున్నారు. వారిలో ఒకడిగా సాగిపోతున్నాడు. తన కొండగురించీ, లోయగురించి చెబుతున్నాడు. కొందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. కొందరు మాకు తెలుసులే అని వెళ్ళిపోతున్నారు. కొందరు అడవిమనిషి అని గేలి చేస్తున్నారు. కొందరు సానుభూతి చూబిస్తున్నారు. అయితే అందరూ తప్పించుకుంటున్నారు. సూరీడు నుంచి... లోయనుంచి .. కొండనుంచి... తమనుంచి ! సూరీడు నడుస్తున్నాడు. ఎదురుగా నిర్మితమవుతున్న సౌధం! అనేక మంది జనాలతో కోలాహలంగా ఉంది. అక్కడ ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాడు సూరీడు. అతనొక సందర్శకుడు, యాత్రికుడు.
సూరీడుకి ఆకలి వేసింది. అడవిలో వెతుకులాటలేదు. ఇక్కడ చూశాడు. ఒక ప్రక్క జనాలు ఒక వరుసలో సాగుతున్నారు. చేతిలో గిన్నెలు. ఆ ముందు ఏవో పదార్థాలు వేస్తున్నారు. అవి తింటున్నారు. సూరీడు కూడా వరుసలో నిలుచున్నాడు. చిత్రం ఆ ఎదురుచూపు ఆకలిని రెండింతలు చేసింది. తన వంతు వచ్చింది. అతడు సూరీడుని చూశాడు. పొమ్మన్నాడు. అది పనివాళ్ళకు మాత్రమే! బిచ్చగాళ్ళకుకాదు. సూరీడులో పౌరుషం పొడుచుకొచ్చింది. నిస్సహాయత లోనికి నెట్టేసింది. ఓ ప్రక్క చతికిలబడ్డాడు. ఆకలి, కోపం ... ఇవే భావాలు. ఒకడు వచ్చాడు. పని చేస్తావా అని అడిగాడు. చీకటి లో చిన్న వెలుగులా అనిపించింది సూరీడుకు. అతడు తిండి పెట్టాడు. పనిలో పెట్టాడు. మానవుల మధ్యలో పెట్టాడు. శిలల మధ్యలో పెట్టాడు. రాళ్ళు మోసుకుపోతున్నాడు సూరీడు. ఆ రాత్రి సూరీడు నిద్రపోయాడు. మొదటిసారిగా .. మగతగా... మత్తుగా. ఆ మరునాడు రాజుగారి దగ్గరకు వెళ్దామని బయలుదేరాడు.
దారిలో, తనకు పని ఇచ్చినవాడు కలిశాడు. మత్తులో తూలుతున్నాడు. పడిపోతున్నాడు. అతని పట్టుకున్నాడు. వివరాలు తెలుసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అనేక పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి కదిలింది సూరీడు వద్దకు వచ్చింది. తండ్రిని తీసుకు లోనికి వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. సూరీడు కనులు పాలరాతి విగ్రహాలనే చూస్తున్నాయి. అన్నిట్లోనూ ఒకే రూపం. శిల్పి వెనుక తిరుగుతున్నాడు. కొన్నాళ్ళకి తెలిసింది పాలరాతి బొమ్మకి మనసుకూడా రాతిదే అని. ఎన్నిలోయలు, ఎన్ని కొండలు చెరిగిపోయాయి, విరిగిపోయాయి. ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యాయి. ఎడారులు పొంగి పొరలాయి. ఒక లోయ, ఒక కొండ, కాస్త పచ్చదనం, ఎక్కడో మూలన దాగిపోయాయి. అతడు పని చేస్తున్నాడు. కసి తో చేస్తున్నాడు. రెట్టింపు పని చేస్తున్నాడు. నలుగురి పని చేస్తున్నాడు. రొట్టెలు కాదు నాణాలు తీసుకుంటున్నాడు. ఖర్చు చేస్తున్నాడు.
ఒకనాడు సివంగి పిలిచింది. సింహంలా దూకాడు. అతడు గెలిచాడు. సాధించాడు. అహంకరించాడు. ఆమె గెలిచింది. సాధించింది. ఆనందించిండి. సూరీడుకి సివంగి గూడు అలవాటయ్యింది. గూడు ఇరుకైంది. చెట్ల మధ్య రెండు రాతిపలకలు అంతే.
సూరీడు ఇంటికొచ్చాడు. అక్కడ రెండు చెట్లులేవు. సివంగి ఇల్లు కట్టింది. రాళ్ళాతో. తనకోసం! అతడికి నరికిన చెట్లు కనబడలేదు. రాతి ఇల్లు కనిపించింది. తన సివంగి కట్టిన ప్రేమ మందిరం. అంతదాకా ఆరుబయట పడుకునే సూరీడు సివంగి గూటికి చేరాడు. సివంగి కోసం ఏదైనా చెయ్యాలి. నాణాలు దాచుకోవటం మొదలెట్టాడు. అతడు ఎదుగుతున్నాడు. శరీరంకూడా. నలుగురి చేత పని చేయించే స్థాయికి వెళ్ళాడు. ధనం పెరిగింది. బొజ్జ పెరిగింది. కుటుంబం పెరిగింది. అతడు ఎదుగుతున్నాడు.
అప్పుడప్పుడు కొండ గుర్తుకు వచ్చేది... లోయ గుర్తుకువచ్చేది. మొదట్లో సిగ్గుపడ్డాడు. ఆపై భయపడ్డాడు. సర్ది చెప్పుకున్నాడు. సమర్ధించుకున్నాడు. ఆపై చిరాకును స్థిరపరిచాడు.
ఒకనాడు, మొదటిసారిగా తెలిసి తప్పు చేశాడు. జీర్ణించుకోలేకపోయాడు. ఆరాత్రి చిత్తుగా తాగాడు. అది మనసుని దహించేస్తోంది. తాత గుర్తుకువచ్చాడు. ఆగలేకపోయాడు. తిట్టుకున్నాడు....తాతని! అక్కసంతా వెళ్ళాగక్కాడు. అన్నీ తెలిసి తనను వెళ్ళకుండా వారించనందుకు. తప్పెవరిదో తెలిసింది. అతను స్థిమితపడ్డాడు. ఆ నాటి నుండీ అతను తప్పులు చెయ్యలేదు! తను చేసేవి తప్పులని అతను భావించలేదు మరి!
నాణాలు ఇచ్చే అధికారికి సహాయకుడయ్యాడు. చెట్లు నరికించి సివంగికి పెద్ద ఇల్లు కట్టాడు. రెండు మూడు చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి అతనికి. రాజుగారిని కలిసాడు. అతడు మాట్లాడాడు. భవనం గురించి దాని గొప్పతనం గురించి. రాజుగారి కళాదృష్టి గురించి. రాజు మెచ్చాడు! ఇప్పుడు అతనొక ప్రత్యేక అధికారి! అందరి లోపాలను ఎంచి అదిలించడం, రాజుగారికి వార్తలు చేరవేయటం అతనికతను నిర్ణయించుకున్న పని. అక్కడ ఉన్న రెండురాతిపలకల గూళ్ళన్నీ ఇప్పుడు సూరీడువే!
భవన నిర్మాణం పూర్తికావస్తోంది. రాజుగారి కుమారుడు పెద్దయ్యాడు. వచ్చాడు భవనం చూశాడు. ఆకాశాన్ని అంటేటట్టు సువిశాలమైన ప్రదేశంలో పాలరాతి శిల్పాలతో చిత్రవిచిత్ర కల్పనలతో నిర్మితమైన ఆ భవనం... అతనికి నచ్చలేదు. అలిగాడు. రాజుగారికి ఏం చెయ్యాలో అర్థంకాలేదు. సూరీడు రాకుమారుడికి చెప్పాడు .లోయగురించి అటుప్రక్క ఉన్న కొండగురించి. అక్కడ నుంచి లోయలోకి చూస్తే కలిగే ఆనందం గురించి …ఒకప్పుడు… రహస్యంగా! ఎందుకు చెప్పాడన్నది తెలుసుకోగలిగే స్థాయి దాటి అతని మెదడు సంక్లిష్టమైంది. అది విన్నాడు కనుక రాకుమారుడికి ఇది నచ్చలేదు.
రాజు మందలించాడు. రాకుమారుడు వినలేదు. తనకి కొండమీద వేరొక భవనం నిర్మించమన్నాడు. రాజు అహం దెబ్బతింది. మాటా మాటా పెరిగింది. రాజకీయం మొదలైంది. ముప్పావు వంతు నాశనం అయ్యిన ప్రకృతి ఆ ఆటలో ఒక పావు గా మిగిలింది. రాకుమారుడు స్వతంత్రించాడు. సూరీడు రాకుమారుడి పక్షం వహించాడు. అటువంటి ఉత్కంఠ సమయంలో .....
చంద్రం తాతదగ్గరకు వచ్చాడు. తాత చూశాడు. `ఈ కొండ బాగుందికదూ' అడిగాడు. మాట్లాడలేదు చంద్రం. `నీకు ఈ కొండంటే ఇష్టం కదూ!' చంద్రం మాట్లాడలేదు. అతడికిదేం పట్టలేదు. అతడు తాతనే చూస్తున్నాడు. ప్రశ్న ఉదయించకుండానే ఆగిపోయింది. అతనిలో పరిశీలన పుట్టలేదు. శోధన రూపుకట్టలేదు. సమాధానం ఉందోలేదో, ఉండేదో లేదో... ప్రశ్న ఉంటేకదా!

`ఇంక ఈ సూరీడు కథకు అస్థిత్వం లేదు కదూ!'.

Wednesday, April 28, 2010

మార్పు

కళ్ళు తెరిచి చూశా..
అలానే ఉంది .. దృశ్యం
ఎక్కడి వస్తువులు అక్కడే.. నిశ్చలంగా
పాడైపోయిన కుట్టు మిషను
అద్దాల బీరువా
చిందరవందరగా పుస్తకాలు...
రాత్రి కనులు మూసినప్పుడు ఎలా ఉన్నాయో .. అలాగే
వాటికి ఎంత గుర్తు!
ఇదేమిటి ... క్రింద పడి ఉన్న పెన్ను... కాస్త దూరంలో కాగితం
రాత్రి టేబులు పై ఉండేవి.
అన్నీ యధాస్థానాల్లోకి వచ్చేశాయే... ఇవి మాత్రం అలసిపోయినట్లున్నాయి!
టేబులు ఎక్కలేక ఇక్కడే కూలబడ్డాయి.
నాకనులు కప్పి ఈ కాగితం గగనవిహారం చేసిన స్మృతులు ఎక్కడ నిక్షిప్తమయ్యాయో
ఈ పెన్ను టేబులు పై నుండి బంగీ జంపు చేస్తు వేసిన కేరింతలు ఎక్కడ ప్రతిధ్వనించాయో
నేను గమనించని ఆ క్షణాలలో ....
` ఫేను గాలికి కాగితం ఎగిరి పడింది. ఇక పెన్ను.. ఏ బల్లో దొర్లించుంటుంది. '
తర్కానికి ఎందుకో ప్రతీదీ సహజం అని చూపించాలని తాపత్రయం.
మార్పుని గమనించం. గమనించినా పరిశీలించం
పరిశీలించినా.. అనుభూతి చెందం.
స్నానం చేసేటప్పుడు నా తలపై రాలిన నీటి చుక్క... శతసహస్రమై ప్రిదిలిపోయింది
నా మోజేతి పై వెండ్రుకల మధ్య ట్రెక్కింగ్ చేస్తున్న చీమ ... ఏమనుకుంటోందో
న్యూస్ పేపర్లో వార్తలకి, టీవీలో కార్యక్రమాలకీ, ఇంట్లో మనుషులకీ ఒకేలా ప్రతిస్పందిస్తూ
మనసు మొద్దుబారిపోయింది.
చిత్రం
బుద్ధిపూర్వకంగా మార్పుయొక్క స్పృహను నిరోధించుకుంటూ... మార్పునే వాంఛిస్తూ ఉంటుంది మనసు.

Friday, April 23, 2010

ప్రకృతి

Nature's first green is gold,
Her hardest hue to hold.
Her early leaf's a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.
- Robert Frost

తే.గీ || ప్రకృతి తొలిహరితమ్ము అభ్రమపు మెఱుగు
చొచ్చువడెడి గాఢపుఛాయ చూపనపుడు
ఆమె కిసలయమ్మదికాదె అలరు మొదలు
అట్లరఘడియ వరకుండునంతె మిగులు

అంత పతనమ్ము పతనమై అణగిపోవు
నందనమ్మొక శోకమై నలిగిపోవు
అదలి ప్రత్యూష మెటొబోవు అహము వచ్చు
సిరి యనునదేది మనలేదు చివరివరకు!

Sunday, March 21, 2010

ప్రయత్నం


ప్రయత్నిస్తున్నా...
ఏకాంతంగా .. సందడిగా
వాళ్ళ మాటల్లో
నా చేతల్లో….                                                   
ప్రయత్నిస్తున్నా
దేవునిపటం ముందు
అద్దం ముందు
రక్తం త్రాగుతున్న దోమ కడుపులో ఎర్రదనాన్ని చూస్తూ
ప్రకృతిని చూస్తూ...చిన్నగా చూస్తూ..
నోటితీట మాటల్లో
మౌన వికారాల్లో …                                           
ప్రయత్నిస్తున్నా
అమ్మాయల సౌందర్యం చూస్తూ ... ఉత్తేజంతో       
ప్రయత్నిస్తున్నా
నిర్లిప్తంగా శూన్యాన్ని చూస్తూ ...                         
ప్రయత్నిస్తున్నా
క్షణాలకు బానిసనై
కాలం కదలికలని అస్తవ్యస్తంగా గుర్తిస్తూ …          
ప్రయత్నిస్తున్నా
రాయిలా... స్థిరంగా...                                          
ప్రయత్నిస్తున్నా
రాయిలా... దొర్లిపోతూ...                                       
ప్రయత్నిస్తున్నా
రంగులకలలో పరిభ్రమిస్తూ
చీకటి గుహలో ప్రతిధ్వనిస్తూ
ఛీ కొడుతూ.. జై కొడుతూ .                                 
ప్రయత్నిస్తున్నా..
అహంకారం తొడుక్కునే ముసుగుల సంఖ్యను లెక్కిస్తూ
బాధ.. ఆనందం.. అనుభూతుల  ఆంతర్యాల వెనుక
ప్రయత్నిస్తున్నా
ఈ ప్రయత్నం ఎందుకో ?…తెలియని నిర్వేదంలో
తెలిసిన ఆ ఉద్వేగపు ఘడియలలో
తెలిసీ తెలియని సహజస్థితిలో
నాక్కూడా తెలియకుండానే
ప్రయత్నిస్తున్నా.. ప్రయత్నిస్తూనే ఉన్నా... నన్ను చూడాలని

Saturday, February 27, 2010

ఎదిగిపోయాను!!

నాలోని వ్యక్తిత్వం,
సముద్రంలో ఓడ.
ఎన్ని సాహసయాత్రలు!
ఎగసే ఆలోచనల అలలు, చెలరేగే తుఫాను అలజడులు,
ఘోరమైన సుడులు.
నా నుంచి నన్ను నేను కాపాడుకుంటూ...
సముద్రంలో రత్నాల కోసం
ఓడని వదిలీ వదలకుండా... నీటిలోకి దూకి
గాలింపు
ఆహా!
ఏమి ఉత్కంఠ!... ఎంత ఆనందం!.. ఏం సంతృప్తి!...ఎంతటి గర్వం!
ఐనా,
అవన్నీ నా చిన్నతనపు ఊహలు. కలలు.

కళ్ళు తెరచి చూస్తే అక్కడున్నది...
ఒక వీధి కాలవ!
తడిసిపోయి, ఎండిపోయి, చిరిగిపోయి
పనికిరాక మూల విసిరేయబడ్డ
ఓ కాగితప్పడవ.

ఆత్మ లోతుల్ని అందుకోవాలనీ, అంచుల్ని తాకిచూడాలనీ
ఇంకా ఉత్సాహపడే నావికులు ఎందరో!
వాళ్ళంతా పసివాళ్ళు.

ఇప్పుడు నేను ఎదిగిపోయాను!! చాలా ఎదిగిపోయాను!

Monday, February 1, 2010

నీహారం.. నీహారం..

హిందీ సినిమా ‘దిల్ చాహ్ తా హై’ లోని ‘తన్హాయీ.. తన్హాయీ’ పాటకు అనుకరణ

నీహారం.. నీహారం...
నలుదిశలా క్రమ్మేసింది .. నీహారం
నీహారం.. నీహారం...
యదనిండా మండే సాంద్ర నీహారం       ||నీహారం||

చూసే చూపుతోనే కాటు వేసే పాము విసమై
కాసే జోత్సనిశిలో ఉసురు తీసే జాము వశమై

ఆశలే .. ఆరెనే
శ్వాసలే... జారెనే...

ఆ నవ్వులపూవుల దండలు నామెడకే ఉరిహారం     ||నీహారం||

రాతిరి కలలో లేతగులాబీ
               తేనెల చినుకుల తడిసానే...
చినుకులు కావవి చితిలో నిప్పులు
               తెలిసెనులే తెలవారగనే!     ||2||

కంటిలో... అరుణమే
కారెనే.. రుధిరమే....

ఈ తీరని దాహంతో మది మారెనెడారి సహారం  ||నీహారం||

ఎందుకు నీకై మనసిచ్చానో
          ఎందుకు నే బలి అయ్యానో
ఎందుకు తపనల వెల్లువలో నను
          ఉక్కిరిబిక్కిరి చేశానో         ||2||

వలపులే .. నేరమా
తలపులే.. భారమా....

ఈ శూన్యపు క్రిక్కిఱియా నా పాపానికి పరిహారం  ||నీహారం||

పదముల నడకలు నీవైపేనని
            తెలియకనే దిశ మారింది
హృదయపుటలికిడి నీ పేరేనని
            తెలిసేలోపే ఆగింది            ||2||

క్షణములే .. ఆగెనో
రణములే.. సాగెనో.....
ఈ ప్రేమను చిలికిన మింగక తప్పదు గరళాహారం      ||నీహారం||

Monday, January 25, 2010

నేను చూస్తున్నాను...

రక్తం చిన్నగా కారుతోంది.. బొట్లు బొట్లుగా
భరింపరాని బాధ
బిగుసుకున్న పిడికిలి
వెర్రికేక పెడుతున్న ... ఆ కళ్ళు
అది ప్రసవ వేదనా?!
అది జ్ఞాపకాల మల విసర్జన!!
మనసులో ఎక్కడో ఓ మూల.. శంక
సుదిలా గుచ్చేస్తోంది!
నేను చూస్తున్నాను..
ఆ చేతులు శూన్యాన్ని పిండేస్తున్నాయి
ఆ శూన్యంలో.. నిగూఢంగా దాచుకున్న అతని బలహీనతలు

పంటి క్రింద అదిమిపెడుతున్న అహం
ఎవో నిజాలు అతనికే తెలియనివ్వకుండా


నేను చూస్తున్నాను...
ఎన్నాళ్ళిలా ?? .. సమాధానం లేదు
నిర్లిప్తంగా నాకళ్ళల్లోకి చూస్తాడు
అతని అసహాయతకి నా రెప్పలు బరువెక్కుతాయి

ఏం జరిగింది?
కలవరపడ్డ కళ్ళు... నాలో చిన్న అనుమానం
వెనువెంటనే..
కస్సుమని హూంకరిస్తున్నాయి
ఎందుకో అహంకరిస్తున్నాయి .. ఆ కళ్ళు
అప్పుడు తెలిసింది!! పూర్తిగా తెలిసిపోయింది
అతను తప్పు చేశాడు! తనకు సరిపడని తప్పు!
తను జీర్ణించుకోలేని తప్పు!
తనకు మాత్రమే తప్పు!

నేను చూస్తున్నాను...
బేలగా చూస్తున్న ఆ కళ్ళు
అవమాన భారంతో కృంగిపోతున్నాయి
కలైపోవాలని గట్టిగా మూసుకున్నాయి!
ఫరవాలేదు.. ఇంకొద్దిసేపు.. అంతే!
నాలో ఓ నిట్టూర్పు! ఇది మొదటిసారికాదుగా!
వచ్చేస్తోంది!! వెల్లువలా...
అప్రమత్తంగా గమనిస్తున్నాను..

మూసిన రెక్కల వెనుక దృశ్యాలు.. క్రూరమైన దృశ్యాలు
తిమింగళాలను పట్టికోసేస్తున్నారు
బ్రతికున్న పురుగుల్ని నమిలేస్తున్నారు
కొనఊపిరి పిల్లుల్ని వొలిచేస్తున్నారు
దున్నపోతుపై బల్లెపు పోట్లు... వెకిలి నవ్వులు
పసి ఆక్రందనలు.. మానభంగాలు...
వికృత చేష్టలు.. ఊచకోత... రక్తసిక్తం.. కుటిల తంత్రాలు..
ముసుగు నేస్తాలు.. మలిననైజాలు.. నేరాలు... ఘోరాలు
సుడులు తిరుగుతున్న చిత్రాలు... జ్ఞాపకాలు

నేను చూస్తున్నాను...
 అతని కంటినుండి ఉధృతంగా జలపాతం..
నా దరి త్రుళ్ళిన ఒకనీటిబొట్టు
అందులో ఈ సమస్త ప్రపంచాన్ని...
నేను చూస్తున్నాను...
ఆ చుక్కలో... ఒక వారగా... ఒక గది... అతని గది!
ఆ గోడ మీద బల్లి!
చీపురుతో అదిలిస్తున్నాడు.... భయం భయంగా!
బల్లి కదిలింది.. అతని వెన్నులో వణుకు
జర్రున ప్రాకుతూ ఒక మూల నక్కింది
బల్లి లేత చర్మం క్రింద వేగంగా కొట్టుకుంటున్న గుండెకాయ!
ఒక్క క్షణం..
అతడు బల్లిలా పరుగుతీశాడు!
అతనివెనుక పెద్ద ఉక్కు చీపురు.. విసిరేయడానికి .. పడబోతోంది
దిక్కుతోచక గోడవార నిస్తేజంగా అతడు.
అతడి గుండె చప్పుడు గదంతా ఖంగు ఖంగు మని మ్రోగుతోంది
క్షణం దాటింది...
బల్లి గోడమూల.. అతడు గదిలో
ఆ కళ్ళల్లో అయోమయం... భయం!
జీర్ణంకాలేదు..కక్కనివ్వలేదు.. అతని తెలివి
నుదిటిపై చెమట బిందువును తుడిచేసింది.
అటువంటి చినుకులు చేరి .. ఇప్పుడు జడివాన

నేను చూస్తున్నాను...

అతడు తెలివి తప్పాడు...
రక్తం ఆగింది

హమ్మయ్య!!
అతడు పుట్టాడు!!
తనను విసర్జించి.. తనలోంచి తనే.. పుట్టాడు!

అతనికీ, అతని ప్రపంచానికీ జరిగే
నిరంతర అనాచ్ఛాదిత సంభోగ ఫలితం...
ఈ జన్మ జన్మల పరంపర

నెమ్మదిగా తెరుచుకున్న
నిశ్చలమైన కళ్ళతో..

అతడు చూస్తున్నాడు...

Thursday, January 14, 2010

మత్తు

కళ్ళుమూసుకున్నంతనె మత్తుకాదు
కళ్ళుతెరచి చూచేది సత్తుకాదు      ||కళ్ళు||

మనసు పొరల దాగింది
మనసు పొరల దాగింది కలల వలల చిక్కింది
ఉందిలేదు తెలిసొచ్చే గమ్మత్తుల మత్తు ఇది ||కళ్ళు||

ఉన్నదంత ఒకటనుకుంటే, నీకు నాకు తేడా ఏంది
ఉన్నదేది లేదనుకుంటే కళ్ళముందు ఇషయం ఏంది

చూసేదేలేకుంటే చూపుకు అసలు ఉనికేది
చూపన్నది లేకుంటే ఎవరంటా చూసింది
నీకు నిన్ను చూపించే మాయదారి మత్తు ఇది  ||కళ్ళు||

ఒక నిముసం గోలెడతావు
ఒక నిముసం మానౌతావు
ఒక నిముసం బ్రతికుంటావు
మరు నిముసం ఏమౌతావు

ఒక నిముసపు కలలోనే జీవితాన్ని చూసేస్తావు
జీవితంలొ ప్రతి నిముసాన్నీ కలగంటూ గడిపేస్తావు

నువు ‘ కలవో ’ నువు ‘ కల ’ వో  కనుగప్పే మత్తు ఇది   ||కళ్ళు||

Wednesday, January 13, 2010

మంట


 రాత్రి చెమటలో బాగా తడిసిన బొగ్గులు.. చీకట్లు
అగ్గిపుల్లలు అయిపోతున్నాయి
నిస్తేజంగా  చేతులనుండి రాలిపోతున్నాయి
గాలి మారాం చేస్తోంది
నిద్దుర మత్తు ఇంకా వదిలినట్టులేదు
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.


మొత్తానికి మంట రాచుకుంది
చుట్టూ చూశాడు
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది

కర్రల్ని సర్ది కూర్చున్నాడు
మొక్కుబడిగా
ఓ కుక్క చూసి పోయింది
ఎక్కడో చిన్న శబ్దం
టి.వి అయ్యుంటుంది
మెల్లగా లేచాడు
రెండు ఫొటోలు తీశాడు
తన పని అయ్యిపోయింది
ఈసారి బాగా జరిగింది!
.... జరిగింది
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది

లోపలికి వెళ్ళి టి.వి ముందు కూర్చున్నాడు
అప్పుడప్పుడు కిటికీలోంచి చూస్తున్నాడు
మార్నింగ్ వాక్ చేస్తున్న జనాలు
ఆరుతున్న మంటని చిరాగ్గా చూస్తున్నారు
వాతావరణ కాలుష్యానికి ఇది పరాకాష్ఠ అన్నట్లు

‘మా కాలంలో వీథి అంతా కలసి వేసేవారు
ఇప్పుడు ఏ ఇల్లుకాఇల్లే’
ఒకావిడ సన్నాయి నొక్కులు

సముద్రంలో ఉప్పుబస్తాలా ..
భోగిమంట .. చీకట్లో మెల్లగా మమేకమైయ్యింది

Sunday, January 10, 2010

ఆకాంక్ష

గాలి కొరకు ఎదురు చూస్తే .. సుడిగాలి రేగింది
నీటి చుక్క వెతుకుతుంటే.. వరద ముంచి పోయింది   ||గాలి||

ఎండమావులె ఆసరా, ఈ ఎడారి దారులా
సాగుతోంది నా పయనం, అంతులేని జీవనం

నీడ కొరకు విత్తునేస్తే... మరులుతీగ ప్రాకింది  ||గాలి||

అందలేని ద్రాక్షకు ఎదురుచూపులుండునా
కంచికెళ్ళు కథలను ఆగమంటె ఆగునా

చిరునవ్వుకు ఆశపడితే.. నవ్వులపాలయ్యాను  ||గాలి||

అమావాస్యరాతిరిలో అలముకున్న చీకటిలో
వెతుకుతుంటి నా గమ్యం వెతశరాల కౌగిటిలో

వెలుగుకొరకు ఎదురుచూస్తే.. నా.. చితిమంట ఎగసింది  ||గాలి||