Tuesday, June 8, 2010

అసహనం!!

ప్రళయ ఝంఝా మారుత ప్రభంజనంలో
కూకటి వేళ్ళతో పెళ్ళగింపబడిన వృక్షాలై నా నరాలు నానుండి త్రుళ్ళిపోవాలి
బీటలువారిన భూమిలా నా చర్మం చీరిపోవాలి. 
నిలువెల్లా నన్నునేను చీల్చుకుని ..పిచ్చిగా దిక్కులు పిక్కట్లిల్లేలా అరవాలి.
ఆ ధ్వని నా చుట్టూ పరిభ్రమించాలి. నాలో ప్రతిధ్వనించాలి.
అగ్నిపర్వతోద్గార ద్రవానలమై  నలుదిక్కుల చిమ్మేయాలి 
కుప్పించి ఎగసిన కరి శతమ్ముల క్రింద నలిగి అణిగి భూస్థాపితం కావాలి .
మహోగ్రతరంగాలు ఉక్కుమ్మడిగా మీద పడి శరీరాన్ని తుత్తునకలు చేసేయాలి.  
ప్రచండ వేగంతో భూమి పైపొరలను తాకుతున్న ఉల్కలా నిలువెల్లా మండిపోయి, ప్రిదిలి పోయి ప్రేలి పోవాలి.
ఉగ్ర చైతన్యంలో ఉడికిపోవాలి
మహోగ్ర చైతన్యంలో మ్రగ్గిపోవాలి
రుద్ర చైతన్యంలో ఛిద్రమవ్వాలి
క్రిక్కిరిసిన చైతన్యంచే నా అస్థిత్వంలోని ప్రతి కణం, ప్రతి క్షణం ధ్వంసమవ్వాలి.
విశ్వ చైతన్య విలయ విస్ఫోటనలో నేను విధ్వంసమవ్వాలి 
జరగాలి ...జరిగిపోవాలి !!
కృష్ణబిలోన్ముఖంగా నా పయనం
ఆ అంచు చేరే వరకే .. ఈ అసహనం

3 comments:

Sai Praveen said...

ఇందుకోసం ఈ అసహనం?
కారణం ఏమైనా మీ అసహనపు ఆవిష్కరణ అద్భుతం

Unknown said...

అద్భుతమైన అనుభూతినిచ్చారు, మీ పాత కవితలు కూడా చదివాను. చాలా బాగున్నాయి.

తిక్క తింగరోడు said...

ఏందివయ్యా నీ బాధ! ఏమైతేందిగాని బాగానే గీకుతానవ్. గుడ్డో....గుడ్డు..