Monday, February 1, 2010

నీహారం.. నీహారం..

హిందీ సినిమా ‘దిల్ చాహ్ తా హై’ లోని ‘తన్హాయీ.. తన్హాయీ’ పాటకు అనుకరణ

నీహారం.. నీహారం...
నలుదిశలా క్రమ్మేసింది .. నీహారం
నీహారం.. నీహారం...
యదనిండా మండే సాంద్ర నీహారం       ||నీహారం||

చూసే చూపుతోనే కాటు వేసే పాము విసమై
కాసే జోత్సనిశిలో ఉసురు తీసే జాము వశమై

ఆశలే .. ఆరెనే
శ్వాసలే... జారెనే...

ఆ నవ్వులపూవుల దండలు నామెడకే ఉరిహారం     ||నీహారం||

రాతిరి కలలో లేతగులాబీ
               తేనెల చినుకుల తడిసానే...
చినుకులు కావవి చితిలో నిప్పులు
               తెలిసెనులే తెలవారగనే!     ||2||

కంటిలో... అరుణమే
కారెనే.. రుధిరమే....

ఈ తీరని దాహంతో మది మారెనెడారి సహారం  ||నీహారం||

ఎందుకు నీకై మనసిచ్చానో
          ఎందుకు నే బలి అయ్యానో
ఎందుకు తపనల వెల్లువలో నను
          ఉక్కిరిబిక్కిరి చేశానో         ||2||

వలపులే .. నేరమా
తలపులే.. భారమా....

ఈ శూన్యపు క్రిక్కిఱియా నా పాపానికి పరిహారం  ||నీహారం||

పదముల నడకలు నీవైపేనని
            తెలియకనే దిశ మారింది
హృదయపుటలికిడి నీ పేరేనని
            తెలిసేలోపే ఆగింది            ||2||

క్షణములే .. ఆగెనో
రణములే.. సాగెనో.....
ఈ ప్రేమను చిలికిన మింగక తప్పదు గరళాహారం      ||నీహారం||

4 comments:

Unknown said...

beautiful!
నీహారం అంటే ఏంటండీ? loneliness అనా?

Anonymous said...

నీహారం అంటే మంచు..which is generally used to depict loneliness, melancholy, sadness etc..

Sai Praveen said...

చాలా బాగుందండి. బాణీకి చక్కగా అతికింది. భావం చాలా బావుంది.

Lalitha Pamidipati said...

ఒక రౌండు పాడేసుకున్నాను కూడా!! (నేటి) సినిమా రచయతలు రచయతలు కాదు అంటారు మల్లిక్ గారు కాని, ఇంత మంచి సాహిత్యం ఇస్తే యెంత బాగుంటుందో! ట్రై చెయ్యచ్చు కదా?