Sunday, May 18, 2014

మాయ కమ్మిన మనిషి మంచిచెడులెంచకే చిలకా..!


మాయ కమ్మిన మనిషి మంచిచెడులెంచకే చిలకా..
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!

చేసేది నువ్వైనా చేయించు వాడెవడో ...
             ఆచరణ నీదైనా ఆలోచనెవరిదో....!

పాప పుణ్యాలగోలా నీకెందుకే చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

ఎగిరెగిరి పడుతుంది, అటు ఇటుపోతుంది..
            పట్టుకుందామంటే చేజారిపోతుంది...!

మనసులోని మర్మమింక మరచిపో చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

నిజమనిపిస్తుంది, ఆశకలిగిస్తుంది......
           కలలా కనిపిస్తూ శూన్యమైపోతుంది..!

జీవితమేదైనా జీవించవే చిలకా..!
నిన్ను నన్ను ఆడించే దైవాన్ని తెలుసుకో చిలకా!                   ||మాయ||

Friday, May 16, 2014

రవీంద్రుని గీతాంజలి :- 21 ; నా ప్రయత్నం


అలసి నిదురబోవుచునుండె... ఈ తీరము
అలల వడికబురులు పంపె.. ఆ తీరము
తప్పదేమో ఈ వియోగం
తెప్పపై నా ప్రయాణం
నేస్తమా... శెలవిక..శెలవిక...శెలవిక..||అలసి||

నేలనొరిగి నలిగిన పూవుల వేదనేదో
రాలిపోవు ఆకుల రొదలో గాథలేవో
బ్రతుకిదే భారము
తెగెను ఆధారము
వాసంతమా .. శెలవిక... శెలవిక...శెలవిక..||అలసి||

కనుచూపు నిండిన శూన్యత  .. కాసారమా
మనసులో ఎగసిన చేతన .. సంగీతమా
ఈ గాలి సరాగాలేవో
లో లో తరంగాలయ్యే
కాలమా.. శెలవిక... శెలవిక...శెలవిక..||అలసి||

Wednesday, May 14, 2014

కలలనె కన్పడు మయ్యా దేవా!


కలలనె కన్పడు మయ్యా దేవా
మెలకువ వచ్చిన మొదటికె మోసము       ||కలల||

కన్నులు తెరిచిన కమనీయంబుగ
అన్నుల మిన్నలె అగుపింతురుగా    |2|
చిన్నగనైనా చిత్తమునందున
అన్నన! నీ స్మృతి అరుదుగదయ్యా          ||కలల||

నయనము చూపును నలుదిశలందున
మాయాలోకము మతి చెదరా      |2|
స్వయముగ నీవే రయముగ వచ్చిన
భయపడి ప్రక్కల పారెదనేమో                ||కలల||

తర్కముతోనే తర్జనభర్జన
మర్కట గతినే మందునయా      |2|
అర్కుని జ్వలనము అగ్గిపుల్లతో
మూర్ఖముగా మది పోల్చుట తగదుగ      ||కలల||

నిదురను వీడిన నిత్యము ఏదో
కదనమె కాదా ఖర్మమున      |2|
ముదములుబాధలు ముసిరెడి వేళల
కుదురుగ యుండుట కుదరదు గానీ        ||కలల||

Tuesday, May 13, 2014

ఆనందం

ఆనందమ్మొక దండదీపము తదీయాకర్షణాభాసమున్
తానంబాడ జనాళి ఱెక్క చెదలై తచ్చాడి యచ్చోటనే
నానా వర్ణ మహోర్ణనాభి గృహమం దజ్ఞాన సృష్టిన్ వడున్
జ్ఞానిన్ సైతము గౌళి తాదృశముగా సాపా డహంత్వం బటన్

భావం  :
ఆనందం ఒక .tubelight.
దాని ఆకర్షణకు చేరే ఈసుళ్ళీ జీవులు.
ఈ సృష్టి -  అజ్ఞానం అనే ఒక పెద్ద సాలెగూడు.
అందులో పడిపోతారు.
జ్ఞానులను సైతం అహంకారం
బల్లిలా ఆ ప్రక్కనే ఉండి కబళిస్తుంటుంది

Monday, May 12, 2014

రవీంద్రుని గీతాంజలి :- 19 ; నా ప్రయత్నం


నీ మౌనమూ...
మనసు నిండా మ్రోయనీ
ఈ భారమూ..
తనివి తీరా మోయనీ
                       ||నీ మౌనమూ||

తారల కనుపాపలతో ఎదురుచూచు నిసిలా
ఓరిమి తలదాలిచి నే యుందును తాపసిలా
                       ||నీ మౌనమూ||

చీకటి శెలవు పెట్టి వెడలిపోవు వరకూ
వేకువ తలుపు తట్టి సడులుచేయు వరకూ

సకల జగతి నీ పలుకుల
       వెలుగుల పరవళ్ళలోన
              తడిసి మునకలేయువరకు
                       ||నీ మౌనమూ||

నీ పదాల విహంగాలు
నా గొంతు గూటిలోన
జనిన లలిత గీతాలై
నింగిని రవళించు దాకా….

నీ స్వరాల మరందాలు
నా మది పూదోటలోన
వికసిత సుమగానాలై
భువిని పరిమళించు దాకా …..

                       ||నీ మౌనమూ||

Friday, May 9, 2014

రవీంద్రుని గీతాంజలి : -16 ; నా ప్రయత్నం


చాలును చూచితిన్ బ్రతుకుజాతర నందున నీ వరమ్ముగా
దేలితి సౌఖ్యసంపదల దేహము నొందిన కారణమ్ముగా
గోలయొ గానమో సడుల గ్రుచ్చితి మ్రోగితినెంతొ దైవమా
కాలము కాదొ? నీ నగవు గాంచుచు మౌనముగా భజింపగన్ !

Wednesday, May 7, 2014

రవీంద్రుని గీతాంజలి : -15 ; నా ప్రయత్నం



నీ కోసమె యీ జీవము ! నా గానము !
నీ కొలువున ఈయవా  చిరు స్థానము !
                              || నీ కోసమె||
ఈ జగతిన నా పనేమిటి... శూన్యము
పాడు చున్నది ఏవో పాటలు ప్రాణము
                               || నీ కోసమె||

నిశను నీరవ దేవాలయమున
ఆశ తీరగ ఆనతీయుము  ||2||
శాసింపుమా  పవళింపుసేవకు
        ప్రభూ....! ప్రభూ... ! ప్రభూ....!
శ్వాస గానము చేసి పాడెద ఒసగుమీ ఈ పుణ్యము !
                               || నీ కోసమె||

వెలుగుతీగెల పసిడి వీణియ              
చలితమయ్యే సుప్రభాతము  ||2||
గాలి గుసగుసలాడు వేళను
           ప్రభూ....! ప్రభూ... ! ప్రభూ....!
నిలుపు నీ సాన్నిధ్యము కలుగనీ  సమ్మానము !
                               || నీ కోసమె||